ఎలాంటి పొరపాట్లు లేకుండా ఓటరు జాబితాకు ప్రత్యేక చర్యలు ** జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ **

Published: Monday December 05, 2022
 ఆసిఫాబాద్ జిల్లా డిసెంబర్ 04(ప్రజాపాలన,ప్రతినిధి) : 
2023, భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎలాంటి పొరపాట్లు  లేకుండా స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. ఆదివారం జిల్లాలోని వాంకిడి మండలం ఇంధని, తేజాపూర్, పోలింగ్ బూత్ కేంద్రాలను సందర్శించి ఓటరు జాబితా సవరణ, నూతన ఓటరు నమోదు ప్రక్రియ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఓటరు జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా అధికారులు బూత్ స్థాయిలలో రాజకీయ పార్టీలు నియమించిన ఏజెంట్ల సహకారంతో స్పష్టమైన జాబితా రూపొందించేందుకు కృషి చేయాలని తెలిపారు.ఈ నెల 8వ తేదీ వరకు నూతనంగా ఓటు నమోదు కొరకు 18 సంవత్సరాలు నిండి అర్హత గల వారు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. నూతనంగా ఓటరు నమోదు కొరకు ఫారం-6, విదేశాలలో నివాసముంటున్న భారతీయులు (ఎన్.ఆర్.ఐ.) ఓటు నమోదు కొరకు ఫారం-6ఎ, ఓటరు కార్డుతో ఆధార్ కార్డు అనుసంధానం కొరకు ఫారం-6బి, ఓటరు జాబితాలో పేరు చేర్చడం / తొలగించడం కొరకు ఫారం-7, చిరునామా మార్పు / వివరాల సవరణ/ ఓటరు కార్డు భర్తీ / వైకల్యం ఉన్న వ్యక్తుల గుర్తింపు కొరకు ఫారం-8 లను వినియోగించడంతో పాటు ఆన్లైన్, ఓటర్ హెల్ప్ లైన్ యాప్ల ద్వారా కూడా వివరాలు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. నూతన ఓటరు నమోదు కొరకు జనవరి 1, ఏప్రిల్ 1, జులై 1, అక్టోబర్ 1 తేదీలను ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.