త్రిమూర్తి స్వరూపమే దత్తాత్రేయుడు : 20వ వార్డు కౌన్సిలర్ జైదుపల్లి మురళి

Published: Wednesday December 29, 2021
వికారాబాద్ బ్యూరో 28 డిసెంబర్ ప్రజాపాలన : దత్తాత్రేయున్ని త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అవతారమైన దైవ స్వరృపునిగా భక్తులు ఆరాధిస్తారని 20వ వార్డు కౌన్సిలర్ జైదుపల్లి మురళి కొనియాడారు. మంగళవారం మున్సిపల్ పరిధిలోని 20వ వార్డులో రాజీవ్ గృహకల్ప సమీపంలో మహిళా పోలీస్ స్టేషన్ కు ఎదురుగా పాత దత్తాత్రేయ ఆలయం పునర్నిర్మాణం చేపట్టారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ జైదుపల్లి మురళి మాట్లాడుతూ దత్త అనే పదానికి సమర్పించిన అనే అర్థం ఉందని పేర్కొన్నారు. త్రిమూర్తులు అత్రి మహర్షి, అనసూయ పుణ్య దంపతులకు పుత్రుడి రూపంలో తమను తాము సమర్పించుకున్నారని వివరించారు. అత్రి కుమారుడు అయినందున దత్తునికి భక్తాగ్రేసరులు ఆత్రేయ అని కూడా పిలుచుకుంటారు. దత్తాత్రేయుడు మొట్టమొదటగా యోగదేవుడుగా తాంత్రిక లక్షణాలను ప్రదర్శిస్తూ.. అతడు మరింత భక్తికి సంబంధించిన వైష్ణవ పూజా విధానాలను పుణికి పుచ్చుకుని ఉన్నతునిగా మారాడని భక్తుల విశ్వాసమని గుర్తు చేశారు. భారతీయ చింతనలో అత్యున్నత సారాంశమైన గురువు కంటే ఎక్కువగా కృపా స్వభావం కలిగిన దత్తాత్రేయుడు గుర్తించబడినాడని ప్రతీతి. దత్తాత్రేయుడు త్రిపుర రహస్య గ్రంథకర్తగా పేరు పొందాడని లోకోక్తిగా ప్రసిద్ధి పొందిందని స్పష్టం చేశారు. దత్తాత్రేయ జయంతి రోజు దత్తాత్రేయ దీక్షబూనానని అన్నారు. ఈ దీక్ష 41 రోజులపాటు ఒంటి భోజనంతో కొనసాగుతుందని ఉద్ఘాటించారు. సద్గురు దత్తగోపాల స్వామి ఆధ్వర్యంలో దత్తాత్రేయ దీక్షాబూనడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని ప్రశంసించారు. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 20వ వార్డులో దత్తాత్రేయ ఆలయ పునర్నిర్మాణం చేపట్టడం దైవ సంకల్పంగా భావిస్తున్నానని తెలిపారు. విశ్వ కళ్యాణం కొరకు చేపట్టే దత్తాత్రేయ ఆలయ పునర్నిర్మాణంలో భక్తులు తమ వంతు భూరి విరాళం అందజేయవలసిందిగా కౌన్సిలర్ జైదుపల్లి మురళి కోరుతున్నారు. దత్తాత్రేయుని కృపకు పాత్రులు కాగలరని ఆకాంక్షించారు.