18 సంవత్సరాలు దాటిన తర్వాత నే వివాహాలు జరిపించాలి

Published: Saturday May 28, 2022
చైల్డ్ లైన్ జిల్లా సమన్వయకర్త మడుపు సత్యనారాయణ
 
బెల్లంపల్లి మే 27 ప్రజా పాలన ప్రతినిధి: బాలికలకు 18 సంవత్సరాలు, బాలురకు 21 సంవత్సరాలు, దాటిన తర్వాతనే పెళ్లిళ్లు జరిపించాలని, బాల్య వివాహాలు జరిపించడం చట్టరీత్యా నేరమని, మంచిర్యాల జిల్లా చైల్డ్ లైన్ సమన్వయకర్త మడుపు సత్యనారాయణ అన్నారు.
శుక్రవారం బెల్లంపల్లి నియోజకవర్గం లోని  కాసిపేట మండలం కేంద్రంలో మహిళ మండల సమాఖ్య కార్యాలయం లో చైల్డ్ లైన్ ఆధ్వర్యంలో బాల్య వివాహాలు- నివారణ అనే అంశంపై గ్రామైక్య సంఘాల ప్రతినిధులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన  చైల్డ్ లైన్ జిల్లా సమన్వయకర్త మడుపు సత్యనారాయణ పాల్గొని మాట్లాడారు, మహిళా సంఘాల ప్రతినిధులకు, బాల్య వివాహ నిషేధ చట్టం గురించి అవగాహన కల్పించారు. బాలికలకు 18,  బాలురకు 21 నిండిన తర్వాతనే వివాహం జరిపించాలని అలా కాకుండా చిన్నతనంలోనే పెళ్లి చేస్తే చట్టప్రకారం రెండు సంవత్సరాలు జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా ఉంటుందని హెచ్చరించారు. అదేవిధంగా చిన్న తనం లో వివాహం జరిపించడం వలన ఆడపిల్లలు చిన్నతనంలోనే గర్భం ధరించి అనారోగ్యానికి గురి కావడంతో పాటు పుట్టబోయే బిడ్డ అంగవైకల్యంతో పుడుతున్నారని అన్నారు. 
ఎవరైనా  గ్రామాలలో బాల్య వివాహాలు చేయడానికి సిద్ధపడితే బాలల సహాయ వాణి 1098 కి  ఫోన్ చేసి  తెలపాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని  అన్నారు. 
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ వెంకటేష్ ,  మండల గ్రామైక్య సంఘాల ప్రతినిధులు, సి సి లు,  చైల్డ్ లైన్  సిబ్బంది సుమలత, తదితరులు పాల్గొన్నారు.