కార్యక్రమాల ప్రచార పర్వమే ప్రాధాన్యం

Published: Thursday October 29, 2020

వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేని వ్యాపారం చుక్కాని లేని నావ లాంటిదని గుర్తించిన రాజకీయ పార్టీలు, నాయక ప్రతినిధులు. చేసే పని గురించి, చేసిన పని గురించి చెవిలో జొరీగలాగా పదే పదే ప్రజలకు తెలియజేయడమే ప్రధాన లక్ష్యంగా కృషి చేస్తేనే పార్టీకి గానీ, నాయకులకుగానీ గుర్తింపు రాదు. అందుకు ప్రధాన ప్రచార సాధనం సోషల్ మీడియా. సోషల్ మీడియా చేసే మేలు మరే ప్రచారానికి సాటిరాదు. తాజా తాజా మిర్చీ బజ్జీలలాగా ఒక పార్టీగానీ, ఒక రాజకీయ నాయకుని సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేయడంలో సోషల్ మీడియాను మించినది మరొకటి లేదన్నది జగమెరిగిన సత్యం. గతంలో బిజెపి పార్టీ ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ప్రశాంత్ కిషోర్ లాంటి జాతీయ నాయకులు సోషల్ మీడియా ద్వారానే అధికార చక్రం తిప్పగలిగే స్థాయికి ఎదిగారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆకోవలోకి రావడానికి  వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తొలి నుంచే సోషల్ మీడియా అవగాహన కలిగి ఉండడంతో తాను చేసే కార్యక్రమాల మాలను ప్రజల చెంతకు పకడ్బందీగా చేరవేయిస్తున్నారు. వికారాబాద్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 13 మందిని సోషల్ మీడియా ప్రతినిధులుగా నియమించారు. వికారాబాద్ పట్టణ పరిధిలో 4, వికారాబాద్ మండలంలో ఒకరు, ధారూర్ లో ఒకరు, మోమిన్‌పేట్‌ లో 2, మర్పల్లిలో ఒకరు, బంట్వారంలో 2,  కోటపల్లిలో 2 చొప్పున నియమించారు.
సోషల్ మీడియా ప్రతినిధుల పనులు :
ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కు సంబంధించిన కార్యక్రమాల దినచర్య ప్రణాళికను పకడ్బందీగా రూపొందించడం. సద్విమర్శలను స్వీకరించడం. వ్యతిరేక అకారణ విమర్శలను ఎప్పటికప్పుడు సమయోచితంగా స్పందించడం. టిఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలను గడపగడపకు చేరవేయడం. ప్రజల నాడిని ఎప్పటికప్పుడు తెలుసుకొని తమ నాయకునికి ఉప్పందించడం వంటి పనులను చాకచక్యంగా నిర్వహించుటకు ఎమ్మెల్యే పలు దఫాలుగా సోషల్ మీడియా ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించారు.
సోషల్ మీడియా ప్రతినిధులు అందరితో కలుపుగోలుతనం :
పార్టీ కార్యకర్తల కంటే భిన్నమైన వ్యక్తులు సోషల్ మీడియా ప్రతినిధులు. అందరి విషయాలు, అన్ని విషయాలు రహస్యంగా సేకరించి తమ నాయకునికి చేరవేయడంలో అందెవేసిన చేయిలాగా వ్యవహరిస్తారు. సోషల్ మీడియా ప్రతినిధులు ఎవరికి శతృవులు కారు, మితృలు అంతకన్నాకారు. అలాగని తమ నాయకుని  లక్ష్మణరేఖను జవదాటని అనుసంధానకర్తలు.
సోషల్ మీడియా నిర్వహించే వ్యక్తులు భాషా పరిజ్ఞానం, చతురత, సమయస్ఫూర్తి, స్పందించే చాకచక్యం అత్యంతావశ్యకం. వీరు ఏ చిన్న తప్పు చేసినా దాని ఫలితం మాత్రం వీరి నాయకుడు, పార్టీకి శిరోభారం మిగల్చకతప్పదు. సోషల్ మీడియా ప్రతినిధులు రాజకీయ పార్టీలకు, నాయకులకు అమ్ములపొదిలోని బాణాల్లాంటి వారు. వీరు స్పందించే తీరుపై రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మంచి చేయకపోయినా ఫరవాలేదు కానీ చెడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జరుగకుండా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది.