రూర్బన్ నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలి

Published: Wednesday April 07, 2021
జిల్లా కలెక్టర్ పౌసుమి బసు
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 06 (ప్రజాపాలన) : కేంద్ర ప్రభుత్వ రూర్బన్ పథకము క్రింద చేపట్టిన నిర్మాణపు పనులను వేగవంతం చేసి వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పౌసుమి బసు సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ రూర్బన్ పథకం క్రింద చేపట్టిన నిర్మాణపు పనులపై సమీక్షించారు. తాండూర్ లోని అంతారంలో రూ.2.00 కోట్లతో నిర్మాణంలో ఉన్న ఆడిటోరియం భవన నిర్మాణపు పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలని సూచించారు.  కరణ్ కోట్ లోని ఆర్ఎల్ యు భవన నిర్మాణం, జీపీ భవనాలు, సీసీ రోడ్డు, మురికి కాల్వలు, బస్సు షెల్టర్లు, పిహెచ్ సి సబ్ -సెంటర్లు, పాఠశాల అదనపు తరగతి గదులు, అంగన్వాడీ సెంటర్లలో మరుగుదొడ్లు, తాండూర్ పట్టణంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ భవన నిర్మాణపు పనులను యుద్ధ ప్రాతిపదికన ఈ మాసాంతం వరకు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనులలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా సెలవు దినాలలో పనిచేసి పూర్తైన పనులను ప్రతిరోజు ఫోటోలు షేర్ చేయాలని సూచించారు.  కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు లాప్స్ కాకుండా అన్ని పనులు పూర్తి చేయాలని, పనులలో నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ డిఒ కృష్ణన్, ఈఈ పిఆర్ శ్రీనివాస్ రెడ్డి, టిఎస్ ఈ డబ్ల్యూఐడిసి రాజు తదితరులు పాల్గొన్నారు.