రీజినల్ రింగ్ రోడ్ ను మన్నెగూడ వరకు విస్తరించండి

Published: Wednesday March 24, 2021
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్
వికారాబాద్ జిల్లా ప్రతినిధి మార్చి 22 ( ప్రజా పాలన ) : 750 కోట్ల నిధులతో రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టడం సంతోషించదగిన విషయమని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ ప్రశంసించారు. సోమవారం అసెంబ్లీ సమావేశాలలో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ రింగ్ రోడ్ సమస్యను సభాపతి పద్మారావు గౌడ్ ద్వారా ఆర్ అండ్ బి మినిస్టర్ వేముల ప్రశాంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో వికారాబాద్ కు చాలా అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. రీజనల్ రింగ్ రోడ్డు చేవెళ్ల మన్నెగూడ మధ్యలో వస్తుందని ప్రతిపాదనలు ఉండిందని గుర్తుచేశారు. కానీ ప్రస్తుతం చేవెళ్ల కంటే ముందే రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం సమంజసం కాదని వివరించారు. మన్నెగూడ వరకు రింగ్ రోడ్డు ను పొడిగిస్తే వికారాబాద్, తాండూర్, పరిగి ప్రజలకు మేలు చేకూర్చిన వారవుతారని పేర్కొన్నారు.
కెసిఆర్ కిట్ ఒక అద్భుత పథకం : 
మాతా శిశు మరణాల రేటు తగ్గించుటకు కేసిఆర్ కిట్ ను ప్రవేశపెట్టడం అభినందనీయమని ఎమ్మెల్యే కొనియాడారు. అసెంబ్లీ సమావేశాలలో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో కెసిఆర్ కిట్ సమస్యల గురించి సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ద్వారా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లారు. కెసిఆర్ కిట్ పథకం వలన ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందని గుర్తుచేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో 37,472 ప్రసవాలు జరుగగా 27,434 మందికి కెసిఆర్ కిట్లు అందగా ఇంకా 10,038 మందికి కెసిఆర్ కిట్లు అందవలసి ఉన్నదని గుర్తు చేశారు. కెసిఆర్ కిట్ కు డబ్బులు నాలుగు దఫాలుగా వస్తుండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని గుర్తుచేశారు. గర్భధారణ నమోదు ప్రక్రియలో ఏమాత్రం అలసత్వము జరిగినా లబ్ధిదారులకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు ఆలస్యంగా బ్యాంకు ఖాతాలో పడడం లేదా శాశ్వతంగా బ్యాంకు ఖాతాలో జమ కాకపోవడం జరుగుతుందని అన్నారు. కెసిఆర్ కిట్ పథకం వర్తించేందుకు 84 రోజులు గడువు విధించడంతో గర్భిణీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. 84 రోజులు, పన్నెండు వారాలను వైద్య పరిభాషలో ఫస్ట్ ట్రైమినిస్టర్ గా పరిగణింపబడుతుందని పేర్కొన్నారు. మహిళలకు రుతుక్రమం సక్రమంగా జరగకపోవడంతో గర్భధారణ విషయంలో ఆలస్యంగా తెలుస్తుందని వివరించారు. అందువలన పన్నెండు వారాల నుండి 14 వారాలు, 98 రోజులు లేదా రౌండ్ ఫిగర్ 100 రోజుల వరకు పొడిగించాలని సూచించారు. కెసిఆర్ కిట్ పథకం ద్వారా వేసే డబ్బులు బాలింతల అకౌంట్లో వేయడం వలన ఉపయోగం ఉంటుందని అన్నారు. అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ కు బదులుగా జీరో బ్యాలెన్స్ ఉంటే లబ్దిదారులు నష్టపోరని తెలిపారు. 
బాలామృతం : 
బాలామృతాన్ని ఆరు నెలల నుండి మూడు సంవత్సరాల వరకు అందజేయడం అభినందనీయమని ప్రశంసించారు. పాలు గుడ్లు తీసుకుపోయినంత శ్రద్ధగా బాలామృతాన్ని తీసుకొని పోవడం లేదని తెలిపారు. బాలామృతం రుచిలో ఫ్లేవర్ లో ఒక రకమైనటువంటి వాసన రావడంతో తీసుకొని పోవడం లేదని చెబుతున్నారని గుర్తు చేశారు. 
అమ్మ ఒడికి రవాణా సౌకర్యాన్ని పెంచాలి :
వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని యాభై పడకల ఆసుపత్రిగా పెంచడం అభినందనీయమని అన్నారు. ఆస్పత్రిని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి నేను ( వికారాబాద్ ఎమ్మెల్యే ) పరిశీలించడం జరిగిందని వివరించారు. ఆసుపత్రిలో ఇంకా 5 నుండి 10 శాతం పనులు మిగిలి ఉన్నందున ఆ పనులు పూర్తి కావడానికి 70 నుంచి 80 లక్షల నిధుల ఆవశ్యకత ఉందని గుర్తు చేశారు.