బురాన్ పల్లిలో కరెంట్ షాక్ తో ఎద్దు మృతి

Published: Tuesday August 10, 2021
వికారాబాద్ బ్యూరో 09 ఆగస్ట్ ప్రజాపాలన : వ్యవసాయమే జీవనాధారంగా బతికే రైతు సదానంద్ గౌడ్ కు సంబంధించిన వ్యవసాయ జోడెద్దులలోని ఒక ఎద్దు విద్యుత్ షాక్ తో మృతి చెందిన సంఘటన సోమవారం వికారాబాద్ మండల పరిధిలోని బురాన్ పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి గ్రామ సర్పంచ్ భర్త సాయిక్రిష్ణగౌడ్, మృతి చెందిన ఎద్దు కుటుంబ సభ్యులు తెలిన వివరాల ప్రకారం.. రైతు సదానంద్ గౌడ్ కు చెందిన వ్యక్తి పొలంలోని కంది పంటలో గడ్డిని తొలగించుటకు ఉదయం 10 గంటలకు గుంటుకు కట్టాడు. పొలం చివరి భాగానికి గుంటుకు వచ్చే క్రమంలో వరానికి దగ్గరలో ఉన్న విద్యుత్ సపోర్ట్ వైరుకు ఒక ఎద్దు తాకడంతో అధిక విద్యుత్ షాక్ తగిలి ఎద్దు అక్కడికక్కడే మృతి చెందింది. గుంటుకు కొట్టే వ్యక్తి విద్యుత్ శాక్ తో గిలగిలకొట్టుకుంటున్న ఎద్దును తప్పించుటకు చేసిన ప్రయత్నం వ్యర్థం అయ్యింది. ఎద్దును తప్పించే క్రమంలో గుంటుకు కొట్టే వ్యక్తికి కూడా షాక్ తగలడంతో అక్కడి నుండి తప్పించుకొని తన ప్రాణాలను కాపాడుకున్నాడు. సుమారు 80 వేల రూపాయల విలువ గల వ్యవసాయ జోడెద్దు మరణించడంతో కుటుంబ సభ్యుల బాధలు వర్ణనాతీతం. ప్రభుత్వం వెంటనే స్పందించి పేద రైతు సదానంద్ గౌడ్ ను ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతున్నాడు. కొత్తగా విధులలోకి వచ్చిన లైన్ మెన్ శివకుమార్ రెడ్డి, పశువుల డాక్టర్ ఇబ్రాహిం ఎద్దు మృతి చెందిన స్థలానికి చేరుకొని పంచాయతీ కార్యదర్శి రాములు, గ్రామ పెద్ద బాల్ రాజ్ గౌడ్ ల సమక్షంలో పంచనామా నిర్వహించారు.