అవయవ దానం పై ప్రజలకు అవగాహన కల్పించాలి : ఆర్టీసీ ఎండి సజ్జనార్

Published: Tuesday March 15, 2022
మేడిపల్లి, మార్చి14 (ప్రజాపాలన ప్రతినిధి) : రక్త దాతలను సమీకృతం చేసి సేవలందిస్తున్న ప్రతినిధులు అవయవ దానం పై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలంగాణ ఆర్టీసీ ఎండి సజ్జనార్ పిలుపునిచ్చారు. యంగ్ ఇండియా బ్లడ్ డోనర్స్ క్లబ్ 7వ వార్షికోత్సవాన్ని ఉప్పల్లోని ఎస్ వి ఎం హోటల్లో ఘనంగా నిర్వహించారు. ఈ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని యంగ్ ఇండియా సేవా పురస్కారాలు 2022 ప్రధాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎండి సజ్జనార్, దైవజ్ఞ శర్మలు పాల్గొని రక్త దాతలను మరియు పలు రంగాలలో సమాజ సేవ చేస్తున్న వారిని రెండు తెలుగు రాష్ట్రాల్లోని 40 మందిని శాలువాలతో సత్కరించి, యంగ్ ఇండియా సేవ పురస్కారాలు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ యంగ్ ఇండియా బ్లడ్ డోనర్స్ క్లబ్ ఫౌండర్ జేబీ బాలు మరియు డా.ఇందిరా ప్రియదర్శిని ఈ సంస్థ ద్వారా ఎందరో రక్త దాతలను సమీకృతం చేసి సేవలు అందిస్తున్నందుకు ప్రసంశిస్తూ, అవయవ దానంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఫౌండర్ జేబి బాలు, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు డాక్టర్ ఇందిరా ప్రియదర్శిని, సంఘం ముఖ్య సలహాదారులు వెంకట పుల్లయ్య, ఆర్ పి ఎస్టేట్స్ ఈ డి షేక్ మస్తాన్, గుండపనేని సతీష్, డాక్టర్ సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.