కటుకం గణేష్ ను సన్మానించిన ఎమ్మెల్యే

Published: Monday July 26, 2021
కోరుట్ల, జూలై 25 (ప్రజాపాలన ప్రతినిధి) : ప్రభుత్వాలు, యువజన, స్వచ్చంధ సంస్థలు, సామాజిక కార్యకర్తలు రక్తదానంపై యువతలో నెలకొన్న అపోహలను తొలగించేందుకు ఎన్ని కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ ఇంకా కొద్ది మందిలో అలాగే సందిగ్ధం నెలకొని ఉందనీ, గత 14 సంవత్సరాలుగా కోరుట్ల ప్రాంతంలో రక్తదానంపై నిర్విరామ కృషి చేసి ఈప్రాంత యువతలో చైతన్యం పెంపొందించిన సామాజికవేత్త కటుకం గణేష్ అభినందనీయుడని కోరుట్ల నియోజకవర్గ శాసనసభ్యులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. శనివారం రోజున కోరుట్ల పట్టణంలోని కటుకం సంగయ్య ఫంక్షన్ హాల్ లో మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్యెల్యే కటుకం గణేష్ ను సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎక్కడ రక్తం అవసరమైనా రక్తదాత కొరకు అవసరార్థులు కటుకం గణేష్ ను సంప్రదిస్తుండడం, వారి అవసరానికి తగిన రక్తదాతను గణేష్ వెంటనే సమకూర్చడం హర్షించదగిన విషయమనీ, రక్తదాన సంధానకర్తగా ఒక విభిన్నమైన సామాజిక భాధ్యతను వహిస్తున్న కటుకం గణేష్ సేవలు మరింత విస్తృతం కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్రీమతి అన్నం లావణ్య - అనీల్, వైస్ చైర్మన్ గడ్డమీది పవన్, కోరుట్ల ఎంపీపీ తోట నారాయణ  మున్సిపల్ కౌన్సిలర్ జింధం లక్ష్మీనారాయణ, యువజన నాయకులు ఎండి సనావుద్దీన్, జాల వినోద్, పుప్పాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు..