జిల్లా విద్యార్థుల ప్రతిభ అభినందనీయం జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి

Published: Saturday July 23, 2022

మంచిర్యాల బ్యూరో, జూలై 22,

ప్రజాపాలన :10వ తరగతి, ఇంటర్మీడియట్ ఫరీక్షా ఫలితాలలో జిల్లా విద్యార్థుల ప్రతిభ అభినందనీయమని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. ఈ సంవత్సరం విడుదలైన 10వ తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాలలో మందమర్రిలోని ఆదర్శ పాఠశాల, జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి జిల్లా నుండి ఎం.పి.సి. ప్రథమ సంవత్సరంలో 467/470 మార్కులతో రాష్ట్రంలోనే 2వ ర్యాంకు సాధించిన ఎన్. జాహ్నవిని శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయం లోని కలెక్టర్ చాంబర్లో ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరచడం సంతోషంగా ఉందని, ఇదే స్ఫూర్తితో మున్ముందు మరింతగా రాణించాలని తెలిపారు. అనంతరం ఎం. ఈ.సి. సంవత్సరంలో 486/500 మార్కులు సాధించి జిల్లా స్థాయిలో ప్రథమ ర్యాంకులో నిలిచిన డి. రవళి, 10వ తరగతిలో 10/10 జి.పి.ఎ. సాధించిన 4 విద్యార్థులు జోషితశ్రీ, అక్షర, రాజలక్ష్మి, అభిలాషను అభినందించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ ఎం.జయకృష్ణరెడ్డి, జిల్లా సైన్స్ అధికారి మధుబాబు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.