ప్రజావాణి సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలి ** జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ **

Published: Tuesday August 30, 2022
ఆసిఫాబాద్ జిల్లా ఆగస్టు 29 (ప్రజాపాలన, ప్రతినిధి) : ప్రజావాణి కార్యక్రమంలో అందించిన దరఖాస్తులపై క్షుణ్ణంగా పరిశీలించి అధికారులు పరిష్కరించే విధంగా కృషి చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవనం లో దరఖాస్తులు స్వీకరించారు. జిల్లాలోని రెబ్బెన మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన ధరణి భూమయ్య తనకు గల పట్టా భూమికి సంబంధించి రెవెన్యూ రికార్డుల లో తప్పులు సవరించాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. కాగజ్నగర్ మండల కేంద్రానికి చెందిన అడ్డగుంట సతీష్ కుమార్ తన దరఖాస్తులో తాను పుట్టిన నాటి నుండి అంగవైకల్యం కలిగి ఉండి వికలాంగుల పెన్షన్ పొందానని, కానీ ప్రస్తుతం పెన్షన్ మంజూరు నిలిపివేయబడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తనకు వికలాంగుల పెన్షన్ మంజూరు చేయాలని కోరారు.
 రెబ్బెన మండలం లోని "ఖైర్ గాం గ్రామస్తులు " తమ గ్రామంలో "ఎడవెల్లి గ్రామ రోడ్డులో " పైపులైను నిర్మాణం చేపట్టి అలాగే వదిలివేయడం వల్ల రాకపోకలకు ఇబ్బందిగా ఉందని, గ్రామానికి కేటాయించిన వైకుంఠధామం పని పూర్తిచేయాలని, గ్రామంలోని వాడల లో చెత్తకుండీలు ఏర్పాటు చేయడంతో పాటు అభివృద్ధి పనులు పూర్తి చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్  ఆయా సంబంధిత శాఖల అధికారులకు అందించి పూర్తిస్థాయిలో పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు  తదితరులు పాల్గొన్నారు.