ప్రతి శుక్రవారం డ్రై డే గా పాటించాలి

Published: Friday July 29, 2022
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో 28 జూలై ప్రజా పాలన : ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటించాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సూచించారు. గురువారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ *"మీతో నేను"* కార్యక్రమంలో భాగంగా మోమిన్ పేట్ మండల పరిధిలోని దుర్గంచెరువు గ్రామంలో సర్పంచ్ హరిశంకర్ ఆధ్వర్యంలో ఉదయం 7 గంటల నుండి 11:30 వరకు పర్యటించారు. ప్రతి ఇంటిలో వారంలో ఒకరోజు పరిసర ప్రాంతాలను మరియు మనం వినియోగించే పరికరాలను శుభ్రం చేసుకోవాలన్నారు. గ్రామాల్లోని అన్ని వార్డులలో థర్డ్ వైర్ ఏర్పాటు చేయాలని, గ్రామంలో పంటపొలాల్లో వేలాడుతున్న విద్యుత్ వైర్లను సరిచేయాలని, నూతన స్థంభాలు ఏర్పాటు చేసి, వాటికి వీధి దీపాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కొత్తగా 25కెవి ట్రాన్స్ఫర్మర్ ఏర్పాటు చేయాలని, గ్రామాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ పైపు లైన్ లీకేజీలు లేకుండా.... కలుషితం కాకుండా నీరు అందించాలని పేర్కొన్నారు. ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇవ్వాలని, మిషన్ భగీరథ నల్లాలకు ట్యాప్ లు కచ్చితంగా బిగించాలని స్పష్టం చేశారు. ఎవ్వరు కూడా చెర్రలు తీసివేయరాదని, మిషన్ భగీరథ నీటిని త్రాగాలని, నెలకు మూడు సార్లు కచ్చితంగా నీటి ట్యాంక్ లను శుభ్రం చేయాలని, మిషన్ భగీరథ అధికారులను మరియు పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. వర్షాకాలం సమీపించిన సందర్భంగా గ్రామంలో పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకొని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు.  ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించుకోవాలని, వాటిని వాడుకలో ఉంచాలని బహిరంగ మలమూత్ర విసర్జన చేయరాదని ప్రజలకు సూచించారు.  బావులపై  పై కప్పులు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు మరియు తదితరులు పాల్గొన్నారు.