మార్చి 5న చేనేతల ఆత్మీయ సమ్మేళనం... హైదరాబాద్ (ప్రజాపాలన ప్రతినిధి ):

Published: Saturday March 04, 2023
తెలంగాణ రాష్ట్రంలోని చేనేత సంఘాలను ఐక్యం చేసి ఆ కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలు వాటి పరిష్కార మార్గాలపై సమగ్రంగా చర్చించేందుకు ఈనెల 5న వనస్థలిపురంలోని కర్ణాటి గార్డెన్స్ లో చేనేతల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్లు ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు బండారు ఆనంద్ ప్రసాద్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సమ్మేళనానికి సంబంధించిన బ్రోచర్ ను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాపోలు జగన్, నాయకులు వెంకటేశ్వరరావు, వేముల బాలరాజు, మహిళా నాయకురాలు సబిత లతో కలిసి ఆవిష్కరించారు. మానవాళికి నాగరికతను నేర్పిన చేనేత కుటుంబాలు ప్రస్తుతం ఆర్ధికంగా, సామాజికంగా, రాజకీయంగా  తీవ్ర వెనుకబాటును అనుభవిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమ అద్భుత కళతో మానవాళి గతిని మార్చిన సామాజిక వర్గం పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర వివక్షతను ప్రదర్శిస్తున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో విడివిడిగా పోరాడుతున్న చేనేత సంఘాలను సంఘటితం చేసి హక్కులను సాధించుకునేందుకు సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి వివిధ పార్టీల నేతలు, ఉద్యోగులతో పాటు చేనేత కుటుంబాలు హాజరవుతాయని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఆయన తో పాటు రాపోలు జగన్, సబితా,డాక్టర్. వెంకటేశ్వర్ రావు, వేముల బాలరాజు,వనం శాంతి కుమార్,గవ్వల శంకర్, చోళ రాజేశ్వర్, డాక్టర్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.