ఆశ్రమ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచే దిశగా చర్యలు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ-ఉట్నూర

Published: Saturday December 10, 2022
ఆశ్రమ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి వరుణ్ రెడ్డి అధికారులను, ఉపాధ్యాయులను ఆదేశించారు. శుక్రవారం జిల్లాలోని లక్షెట్టిపేట మండలంలోని గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలను ఆదిలాబాద్ జిల్లా ట్రైనీ కలెక్టర్ పి.శ్రీజతో కలిసి ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరి విద్యార్థులలో విద్యా ప్రమాణాలను పెంచేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న అక్షరజ్యోతి కార్యక్రమాన్ని పకడ్బంధీగా నిర్వహించాలని, ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రతి విద్యార్థికి చదవడం, రాయడం తప్పనిసరిగా రావాలని, ఆ దిశగా విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా విద్యాబోధన చేయాలని, చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. వసతిగృహాల ఆవరణ, గదులు, పాఠశాల ప్రాంగణాలు పరిశుభ్రంగా ఉండే విధంగా పారిశుద్ధ్య చర్యలు, ప్రతి రోజు మెను ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని తెలిపారు. చలితీవ్రత పెరుగుతున్న దృష్ట్యా విద్యార్థుల ఆరోగ్యం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ప్రతి విద్యార్థికి వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు. అంతకు ముందు విద్యార్థులకు అల్పాహారం రుచి చూసి, విద్యార్థులకు అందించే మెను వివరాలను తెలుసుకున్నారు. స్టోర్ రూమ్లో రికార్డులు, వసతి గృహ సదుపాయాలను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు, సలహాలు చేశారు. తరగతి గదిలో విద్యార్థులను సబ్జెక్టుల వారిగా ప్రశ్నలు అడిగి, విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉత్తమ ర్యాంకులు సాధించి ఉన్నత విద్యనభ్యసించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బాలచందర్, వసతి గృహ వార్డెన్ రాథోడ్ గణేష్, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.