మండల కేంద్రాల్లో వచ్చిన దరఖాస్తులను బాధ్యతతో పరిష్కరించాలి

Published: Tuesday February 14, 2023
 వికారాబాద్ జిల్లా కలెక్టర్రె సి నారాయణ రెడ్డి
వికారాబాద్ బ్యూరో 13 ఫిబ్రవరి ప్రజాపాలన : మండల కేంద్రాలలో ప్రజావాణికి వచ్చే దరఖాస్తులను అర్థం చేసుకొని పూర్తి బాధ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి తహశీల్దార్లను ఆదేశించారు.
ధరణి సమస్యల పరిష్కారం కోసం సోమవారం జిల్లాలోని అందరూ తాసిల్దార్లు, ఆర్ డి ఓ లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోర్టు కేసులు లేని, క్లియర్ టైటిల్, పొజిషన్లో ఉండి ఎలాంటి వివాదాలు లేకుండా ఉన్న ధరణి సమస్యలను తప్పకుండా పరిష్కరించాలని కలెక్టర్ తాసిల్దార్లకు  సూచించారు. ధరణి పనుల వల్ల సమస్యలు పరిష్కారం కావాలని, ఇతర సమస్యలు తలెత్తకూడదని అన్నారు. సక్సెషన్ కొరకు డెత్ సర్టిఫికెట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్  లను అందజేస్తే పరిష్కరించడం జరుగుతుందన్నారు.  మోసపూరితంగా పట్టా ఇతరుల పేరుపై మార్పు అయినట్లయితే ఇట్టి సమస్యల పరిష్కారం సివిల్ కోర్టుల పరిధిలో ఉంటుందని తాసిల్దార్ ల పరిధిలో ఉండదని స్పష్టంగా ప్రజలకు తెలియపరచాలన్నారు. అన్ని మండలాల్లో  ప్రతి సోమవారం ప్రజావాణి విధిగా నిర్వహించి ప్రజల సమస్యలకు సానుకూలంగా స్పందిస్తూ సమస్యలను పరిష్కరించాలన్నారు.  ప్రతి సోమవారం నుండి శనివారం వరకు కలెక్టర్ కార్యాలయంలో సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అడిషనల్ కలెక్టర్ తో కలిసి ధరణి సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని కలెక్టర్ తెలియజేశారు.  తాసిల్దార్ల తమ వద్ద ఉన్న నివేదికలను  ఎప్పటికప్పుడు తీసుకొని వచ్చి పరిష్కరించుకోవాలని అన్నారు.
 పోడు భూముల సమస్యల పరిష్కారానికి రెండు ఆధారాలతో కబ్జాలో ఉన్న వారి వివరాలను వారం రోజులలో జిల్లాస్థాయి కమిటీకి ఆమోదం కొరకు  ప్రతిపాదనలు పంపించాలన్నారు. గండిపేట మరో హుస్సేన్ సాగర్ కాకూడదని, మూసి నది ద్వారా  మురుగునీరు గండిపేటలో కలవకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు.  జిల్లా నుండి మూసీ నది ద్వారా గండిపేటకు వెళ్లే వాగులు  నాలాలు కబ్జాకు గురి అయినట్లయితే గుర్తించి అట్టి వాటిని వికారాబాద్ ఆర్డిఓ సర్వే అండ్ ల్యాండ్స్ ఏడి లు కలిసి  సర్వే నిర్వహించి సరిహద్దు పిల్లర్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ అన్నారు.  ఓటరు ఐడి కార్డులు జారీ విషయంలో ఒక మండలం నుండి ఇంకొక మండలానికి ట్రాన్స్ఫర్ కొరకు పోలింగ్ బూత్ ల వారీగా  బి ఎల్ ఓ ల ద్వారా వెంటనే క్లియర్ చేయించాలన్నారు.  అవసరమైన ఫామ్-7 నోటీసులను ఆర్డీవోల ద్వారా జారీ చేయించి సకాలంలో పనులు పూర్తి చేయాలని సూచించారు.  ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, వికారాబాద్ తాండూర్ ఆర్డీవోలు విజయ కుమారి, అశోక్ కుమార్ లతో పాటు అన్ని మండలాల తహసిల్దార్లు పాల్గొన్నారు.