న్యాయస్థానాల్లోనూ ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు కల్పించాలి

Published: Thursday November 24, 2022

జన్నారం, నవంబర్ 23, ప్రజాపాలన: చట్ట సభలతో పాటు న్యాయస్థానాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని బీసీ కులాల ఉద్యమ పోరాట సంఘం ఉమ్మడి అదిలాబాద్ జిల్లా కో కన్వీనర్ శ్రీరాముల గంగాధర్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి మూల స్తంభమైన న్యాయవ్యవస్థలో ఇంతవరకు రిజర్వేషన్లు అమలు చేయకపోవడం పాలకవర్గాల నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమేనని అయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం గడిచిన 75 ఏళ్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్ల అంశాన్ని తొక్కు పెడుతుందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో 32 మంది జడ్జిలు ఉండగా బీసీ కులానికి చెందిన ఒకే ఒక్కరు ఉన్నారని ఇది చాలా బాదాకరన్నారు. 700 మంది జడ్జీల నియామకం జరిగితే బీసీ, ఎస్సీ, ఎస్టీలు రెండు శాతమైనా లేరని, ఈ వివక్షపై కలిసికట్టుగా పోరాడాలని అయన కోరారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా నిబంధనలు పాటించకుండా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయడం అన్యాయమని అన్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జి ఉద్యోగాలలోను రిజర్వేషన్లు పాటించాలనే డిమాండ్ల సాధనకు, బిసి గణనకు అందరం కలిసికట్టుగా పోరాడాలని అయన కోరారు. ఈ కార్యాక్రమంలో ఉమ్మడి అదిలాబాద్ జిల్లా కన్వీనర్ కోడూరు చంద్రయ్య, మంచిర్యాల జిల్లా కన్వీనర్ ఆడెపు లక్ష్మీనారాయణ, కడార్ల నర్సయ్య, మూల భాస్కర్ గౌడ్, వొజ్జల రామన్న, అంజన్న తదితరులు పాల్గొన్నారు.