కాంగ్రెస్ ధర్నాని అడ్డుకున్న పోలీసులు శంకరపట్నం ప్రజాపాలన ప్రతినిధి నవంబర్ 14:

Published: Tuesday November 15, 2022

గన్నేరువరం మండలం, గుండ్లపల్లి గ్రామంలో ఆదివారం రాజీవ్ రహదారి పై స్థానిక సమస్యల పైన  కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, గన్నేరువరం మండల నాయకులు ధర్నా నిర్వహిస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేసి తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడి నుండి కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కి తరలించి ఇబ్బందులకు గురిచేసిన నేపథ్యంలో అందుకు నిరసనగా సోమవారం శంకరపట్నం మండలంలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు స్థానిక ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన తెలిపే కార్యక్రమాన్ని చేపట్టగా కేశవపట్నం ఎస్సై దేశ్ చంద్రశేఖర్ తన బృందంతో ఎక్కడి వారినక్కడే ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.  కొందరు ముఖ్య నాయకులు జాతీయ రహదారిపై బస్టాండ్ సమీపంలో స్థానిక మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించగా కార్యక్రమాన్ని అడ్డుకొని కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కి తరలించారు. శాంతియుతంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన తమని  అదుపులోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు పోలీస్ స్టేషన్లో ధర్నాకు దిగారు. అనంతరం ఉన్నతాధికారుల ఆదేశంతో నాయకులను వదిలేశారు. కార్యక్రమంలో టిపిసిసి మెంబర్, మాజీ జెడ్పిటిసి సభ్యులు బత్తిని శ్రీనివాస్ గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బసవయ్య గౌడ్, మాజీ మండల అధ్యక్షులు రావి సతీష్ గుప్త, మండలం మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండి. జహంగీర్, కేశవపట్నం శాఖ అధ్యక్షులు మొలంగురి సదానందం, గ్రామ యూత్ అధ్యక్షులు పూరెల్ల ప్రశాంత్, వార్డ్ మెంబర్ న్యాలం వీరస్వామి, మండల కిసాన్ సెల్ అధ్యక్షులు తుమ్మేటి రాజిరెడ్డి, గ్రామ కిసాన్ సెల్ అధ్యక్షులు కొత్తపెళ్లి రమేష్, నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్ హిసాముద్దీన్, మోలంగూర్ గ్రామ అధ్యక్షుడు నేరెళ్ల సంతోష్ తదితరులు పాల్గొన్నారు.