సామాన్య ప్రజలకు ఉపయోగం లేని కేంద్ర బడ్జెట్: జడ్పీటీసీ మోదుగు సుధీర్ బాబు

Published: Thursday February 03, 2022
బోనకల్, ఫిబ్రవరి 02 ప్రజాపాలన ప్రతినిధి: సోమవారం పార్లమెంటులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై బోనకల్ మండల జడ్పీటీసీ మోదుగు సుధీర్ బాబు తన స్పందనను వెల్లడించారు. మోదీ ప్రభుత్వం ఇచ్చిన బడ్జెట్ శూన్యమని మండిపడ్డారు. ఈ బడ్జెట్‌లో ప్రత్యేకించి ఏ ఒక్క వర్గానికి మేలు చేకూర్చేలా లేదన్నారు. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ బడ్జెట్ జీరో బడ్జెట్ అని పిలిచారు. జీతభత్యాలు, మధ్యతరగతి పేదలు, యువత, రైతులకు ఈ బడ్జెట్‌లో ఎలాంటి ఉపశమనం దొరకలేదని సుధీర్ బాబు విమర్శించారు. పన్నుల వసూళ్ల భారంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, అయితే పన్నుల వసూళ్లపై  మోదీ ప్రభుత్వానికి  ఉన్న శ్రద్ధ ప్రజల బాధలపై లేదని సుధీర్ బాబు అభిప్రాయపడ్డారు. ఏడేళ్ల తర్వాత కూడా రాబోయే 25 ఏళ్లకు తప్పుడు కలలు చూపిస్తున్నారని, మూడేళ్లలో 4 కోట్ల ఇళ్లు నిర్మిస్తామని గతంలో హామీలు ఇచ్చారని వాటిని తుంగలో తొక్కి,మళ్ళీ ఇప్పుడు చెప్తున్న హామీలు నమ్మశక్యంగా లేవని అన్నారు. పేద ప్రజలకు ఈ బడ్జెట్ వల్ల ఒరిగేది ఏమిలేదని అన్నారు. ఇది ఇలా ఉండగా కేంద్ర బడ్జెట్ పై స్పందిస్తూ భారత రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ సోమవారం సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడిన తీరును ఆయన తప్పుబట్టారు, అంబెద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చాలని మాట్లాడుతున్న కేసీఆర్ తనకి, తన కుటుంబానికి వచ్చిన పదవులు అంబెద్కర్, రాజ్యాంగం ద్వారా మాత్రమే వచ్చాయని గుర్తు ఉంచుకోవాలని, రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ కి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని, మరాల్సింది రాజ్యాంగ కాదని, మోసపూరిత, అసత్య హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కేసీఆర్ మారాలని, కేసీఆర్ బీజేపీతో గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీ చేస్తూ తోడు దొంగలు దేశాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే ప్రయత్నం మానుకోవాలని హెచ్చరించారు. ప్రజలు ఇలాంటి మోసపూరిత ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పాలని రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరారు.