కరుణించు వరుణ దేవుడా...!

Published: Tuesday July 05, 2022
 పట్లూరు గ్రామంలో శివలింగానికి జలాభిషేకం
 వేదమంత్రోచ్ఛారణలతో రుద్రాభిషేకం
 వరద పాయసంతో మొక్కులు చెల్లించుకున్న గ్రామస్థులు
 సర్పంచ్ దేవరదేశి ఇందిర అశోక్
వికారాబాద్ బ్యూరో జూలై 04 ప్రజాపాలన : పాడి పంటలకు మూలం వర్షం. బీడుబారిన భూములను సస్యశ్యామలం చేసేందుకు  వరుణదేవునికి ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం మర్పల్లి మండల పరిధిలోని పట్లూరు గ్రామంలో సోమేశ్వర ఆలయంలో గ్రామ సర్పంచ్ దేవరదేశి ఇందిర అశోక్, గ్రామ ఫెద్దలు, వేద బ్రాహ్మణులు, గ్రామస్థులు, యువతీయువకులు, మహిళల ఆధ్వర్యంలో వర్షాలు విరివిగా కురవాలని శివలింగానికి జలాభిషేకం, రుద్రాభిషేకం నిర్వహించారు. శివునికి ప్రీతిపాత్రమైన రుద్రాభిషేకములో భాగంగా నమకం చమకం వంటి వేద మంత్రాలతో పూజలు చేశారు. వేద బ్రాహ్మణుల రుద్రాభిషేకం మంత్రాలు సోమేశ్వర ఆలయ ప్రాంగణం అంతా ప్రతిధ్వనించాయి. గ్రామంలోని యువతీ యువకులు మహిళలు పెద్దలు రామదండులా కదిలి శివలింగానికి జలాభిషేకం చేశారు. శివలింగం మునిగేటట్లుగా గ్రామస్తులు తలొక బిందెతో నీళ్లు తెచ్చి జలాభిషేకం ఘనంగా నిర్వహించారు. శివలింగానికి నైవేద్యంగా వరద పాయసం అర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వర్ణుడు కరుణించి విరివిగా వర్షాలు కురిస్తే పంటలు సమృద్ధిగా పండుతాయని పట్లూరు గ్రామస్తుల విశ్వాసం. వర్షాలు కురువని ప్రతి సంవత్సరం సోమేశ్వర ఆలయంలోని శివలింగానికి జలాభిషేకం నిర్వహించి రుద్రాభిషేకం పూజలు చేస్తే వర్షాలు విరివిగా కురుస్తాయని ప్రజల ప్రగాఢ విశ్వాసం. పట్లూరు గ్రామస్తులు భక్తుతో చేపట్టిన జలాభిషేకం రుద్రాభిషేకం పూజలు ఫలించి వర్షాలు కురవాలని ఆశిద్దాం. ప్రతి రైతు ఇంట సిరుల పంటలు పండాలని కోరుకుందాం. పాడిపంటలతో ప్రతి ఇల్లు ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షిద్దాం. వర్షాకాలంలో వచ్చే రోగాలను తట్టుకునే శక్తిని శివున్ని ప్రత్యేకంగా ప్రార్థిద్దాం.