రాష్ట్రంలో పండిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసే వరుకు పోరాటం చేస్తాం

Published: Tuesday April 05, 2022
రైతు నిరసన దీక్షలో పాల్గొన్న జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు
బోనకల్, ఏప్రిల్ 4 ప్రజాపాలన ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర రైతాంగం పై కేంద్ర ప్రభుత్వ కక్ష్య సాధింపు చర్యలు మానుకోవాలని జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో రైతులతో కలసి నిరసన దీక్షలు చేపట్టాలని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు సోమవారం బోనకల్ మండల కేంద్రంలో టిఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో రైతులతో కలసి నిర్వహించిన రైతు నిరసన దీక్ష లో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ రాష్ట్ర రైతాంగానికి పెద్దపీట వేస్తూ అండగా ఉంటూ వారికి పంట సహాయం కోసం రైతు బంధు, సాగునీటి కోసం భారీ ప్రాజెక్టులు నిర్మాణం, మరణించిన రైతు కుటుంబానికి అండగా ఉండేందుకు రైతు బీమా ద్వారా ఆర్దిక సహాయం అందిస్తున్నారని, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నారని గుర్తు చేశారు. ఒక పక్క రాష్ట్రంలో రైతులకు పంట సాగు కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసి వారికి కేసీఆర్ అండగా ఉండడంతో పంటలు బాగా పండి రైతుల ఇళ్లల్లో పండుగ వాతావరణం నెలకొందని రైతులు అందరూ ఆనందోత్సాహాలతో ఉంటుంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దానిని జీర్ణించుకోలేక రాష్ట్రం పై వివక్షత చూపిస్తూ రాష్ట్ర రైతాంగం పై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతోందని పేర్కొన్నారు. పంజాబ్ రాష్ట్రంలో పండిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించారు.ఒకే దేశం ఒకే కొనుగోలు విధానం ఉండాలని డిమాండ్ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ కూడా రైతులకు సరైన పథకాలు అమలు చేయడం లేదని రైతు సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నుండి మంత్రులు, ఎంపీల బృందం ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో సమావేశం అయితే అందులో తెలంగాణ ప్రజల పట్ల, రైతుల పట్ల అవహేళన తో మాట్లాడుతూ నూకలు తినండి మీరు అంటూ ధాన్యం కొనుగోలు విషయం లో వారి పద్ధతి మార్చుకోకుండా మాట్లాడం సిగ్గుచేటని, ఏదేమైనా రాష్ట్రంలో పండిన మొత్తం వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసే వరుకు సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు నిరసన, ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు చేబ్రోలు మల్లికార్జునరావు, కార్యదర్శి మోదుగు నాగేశ్వరరావు, మాజీ అధ్యక్షులు బంధం శ్రీనివాసరావు, మాజీ జెడ్పిటిసి బానోత్ కొండ, బోనకల్ సహకార సంఘం అధ్యక్షులు చావా వెంకటేశ్వర రావు, బోనకల్ గ్రామ అధ్యక్షులు గుండపనేనీ సుధాకర్ రావు, గ్రామ కార్యదర్శి తెళ్ళూరి రమేష్, తన్నీరు రవి, రజక సంఘం నాయకులు తమ్మారపు బ్రహ్మయ్య, మందడపు తిరుమల రావు, గద్దల వెంకటేశ్వర్లు, మండలంలోని వివిధ గ్రామాల టిఆర్ఎస్ పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.