ఘనంగా శ్రీ ఛత్రపతి శివాజీ జయంతి శోభాయాత్ర

Published: Saturday February 20, 2021
శేరిలింగంపల్లి, ప్రజాపాలన : శ్రీ ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మియాపూర్ శివాలయం నుండి మొదలుకొని లింగంపల్లి తుల్జా భవాని మాత దేవాలయం వరకు విశ్వహిందూ పరిషత్ , భజరంగ్ దళ్ , సంఘ్ పరివార్ సంస్థలు, బీజేపీ నాయకులతో కలసి పెద్ద ఎత్తున పూజ సామాగ్రితో శోభాయాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు జ్ఞానేంద్ర ప్రసాద్, యోగనంద్, రవి కుమార్ యాదవ్, కసిరెడ్డి భాస్కర్ రెడ్డి, నరేష్, బుచ్చి రెడ్డి, మనోహర్, శ్రీనివాస్, రమేష్, జీవన్, జనార్దన్ రెడ్డి, సుభాష్, కృష్ణ, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 17 ఏండ్లకే యుద్ధం చేసిన ఛత్రపతి శివాజీ చిరస్థాయిగా నిలిచిపోయిన ఒక అద్భుతమైన గెరిల్లా యోధుడు అని అన్నారు.చిన్నప్పటి నుండే పేదలు నివసించే ప్రాంతాలను పరిశీలించడం శివాజీ జీవితంలో ఒక భాగమైంది అని అన్నారు. అలాగే సుదీర్ఘ యుద్ధ కాలంలో లెక్కలేనన్ని యుద్ధాలు చేసినా ఎన్నడూ పవిత్రస్థలాలను ధ్వంసం చేయలేదు. యుద్ధంలో ఓడిపోయిన శత్రువుల రాజ్యంలో ఉన్న యుద్ధం చేయలేనివారికి, స్త్రీలకు, పసివారికి సహాయం చేసాడు అని అన్నారు.నిస్వార్థంగా ప్రజలకు సేవచేయడం, తాను చేస్తున్న పనిపట్ల అంకితభావం, మచ్చలేని వ్యక్తిత్వం ఆయన అనుచరులకు, ప్రజలకు ఆదర్శంగా నిలిచాయి అని అన్నారు. భారతదేశాన్ని ఎందరో రాజులో ఏలినప్పటికీ ఈ లక్షణాలే శివాజీని గొప్పరాజుగా చేసాయి. భారతదేశంలో వేల ఏండ్లుగా కొనసాగిన వ్యవసాయ విధానాలను సమూలంగా మార్చి రైత్వారి విధానాన్ని ప్రవేశ పెట్టారు. అప్పటి వరకు రైతుల మీద ఉన్న అడ్డు అదుపు లేని పన్నుల విధానాన్ని రద్దు చేశాడన్నారు. దౌర్జన్యాలు లేకుండా పన్నులు వసూలు చేసే విధానాన్ని తీసుకొచ్చాడని ఇందుకోసం గూఢచార వ్యవస్థను ఏర్పాటు చేశాడని, సర్వ మతాలను గౌరవించిన సామరస్య ప్రతీక ఛత్రపతి శివాజీ బానిసత్వాన్ని తొలగించిన వీరుడు శివాజీ మహోన్నత మైన విలువల్ని నెలకొల్పి తరువాతి తరాల కోసం అనుసరణీయ మైన మార్గాలను శివాజీ రూపొందించారు. పేద ప్రజల నాయకుడు శివాజీ అనీ, ఒక మతానికి మాత్రమే  ప్రతినిధి ఎంత మాత్రం కాదని శివాజీ జయంతి సందర్భంగా గుర్తు చేసుకుందామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ శోభాయాత్రలో బీజేపీ, విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్, సంఘ్ పరివార్ సంస్థల నాయకులు, శివాజీ భక్తులు, అభిమానులు, తదితరులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.