కాంగ్రెస్ పార్టీ 137వ ఆవిర్భావం దినోత్సవం

Published: Wednesday December 29, 2021
ధర్మాపూర్ గ్రామ సర్పంచ్ బోడ అనిల్
వికారాబాద్ బ్యూరో 28 డిసెంబర్ ప్రజాపాలన : కాంగ్రెస్ పార్టీ 137వ ఆవిర్భావం దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించామని ధర్మాపూర్ గ్రామ సర్పంచ్ బోడ అనిల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి పునరుజ్జీవంకల్పించడానికి మనమందరం కలిసి కట్టుగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలనలో గ్రామాభివృద్ధికి సిసి రోడ్లు, ఇందిరమ్మ ఇండ్లు, భార్యాభర్తలు ఇద్దరికి పెన్షన్లు వచ్చేవని గుర్తు చేశారు. ధర్మాపూర్ గ్రామం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే అభివృద్ధి చెందిందని ఘంటాపథంగా చెప్పారు. ప్రస్తుతం టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ పాలనలో ధర్మాపూర్ గ్రామాభివృద్ధికి నిధులు మంజూరు చేయడంలో సవితి తల్లి ప్రేమను ప్రదర్శిస్తున్నదని విమర్శించారు. సైడ్ డ్రైనేజీల నిర్మాణం లేకపోవడంతో మురికి నీరంతా ఇండ్ల మధ్యలో జామై ప్రజలు అనారోగ్యం పాలవుతున్నా అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని దెప్పిపొడిచారు. వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మీతో నేను కార్యక్రమంలో భాగంగా ధర్మాపూర్ గ్రామాభివృద్ధికి 5 లక్షల నిధులు మంజూరు చేస్తానని ఉత్తర ప్రగల్భాలు పలికారని ఘాటుగా స్పందించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ గూడెం శాంతమ్మ, వార్డు సభ్యులు, గ్రామ కమిటీ అధ్యక్షుడు బంటు జీవన్ కుమార్, ఉపాధ్యక్షుడు బుడ్డ క్రీష్ణ, గ్రామ కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు సి.కొండయ్య వై.బిచ్చయ్య ఆర్.బిచ్చయ్య జి.గోపాల్ రెడ్డి ఆర్.శ్రీనివాస్ యూూత్ కాంగ్రెస్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.