గోదావరి వరద ముంపు బాధితులకు మరియు ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలి పి ఓ డబ్ల్యు

Published: Saturday January 07, 2023
 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గం పహాడ్ మండలం, మణుగూరు - కొత్తగూడెం ప్రధాన రహదారి ప్రక్కన ప్రభుత్వ భూమిలో వరద బాధితులు మరియు ఇండ్లు లేని నిరుపేదల పోరాట కమిటీ ఆధ్వర్యంలో జనరల్ బాడీ సమావేశం జరిగినది.  పోరాట కమిటీ నాయకుడు ఎట్టి లక్ష్మణ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నిర్మల మాట్లాడుతూ కృష్ణసాగర్ గ్రామపంచాయతీ పరిధిలోని సర్వేనెంబర్ 10 లో గల ప్రభుత్వ భూమిని వరద ముంపు బాధితులకు మరియు ఇండ్లు లేని నిరుపేదల నివాస స్థలాలకు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2022 జులై 17 న ముఖ్యమంత్రి బాధితులకు ఇచ్చిన శాశ్వత పరిష్కారం హామీని వెంటనే నెరవేర్చాలని కోరారు. బూర్గంపాడు మండలం కృష్ణసాగర్ పరిసర ప్రాంతాలలోని ప్రభుత్వ భూమిని శాశ్వత ఇంటి స్థలాలకు కేటాయించాలని, పినపాక, భద్రాచలం నియోజకవర్గం లోని ఇండ్లు లేని నిరుపేదలను గుర్తించి ప్రభుత్వం డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించాలని అన్నారు. రెవెన్యూ, ఫారెస్ట్ భూముల మధ్య సరిహద్దులను నిర్ణయించాలన్నారు. సొంత స్థలం ఉన్నవారికి మూడు లక్షలు ఆర్థిక సహకారం హామీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. వీరు చేస్తున్న నిరవధిక నిరసన పోరాటానికి ప్రగతిశీల మహిళా సంఘం పూర్తి మద్దతు తెలియజేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు బానోత్ హుక్ల, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు పెద్దగోని ఆదిలక్ష్మి, నాయకులు పున్నంచంద్ , జక్కం కొండలరావు,  ముత్యాల సత్యనారాయణ, ఇండ్ల స్థలాల పోరాట కమిటీ నాయకులు ఎట్టి లక్ష్మణ్, కొమరం సుజాత, కొమరం భద్రమ్మ, సున్నం భూలక్ష్మి, గజ్జల అలివేలు, పర్సిక రమణ, కురసం రవీందర్, చిడుం ప్రశాంత్, సూరబాక అనంతలక్ష్మి  తదితరులు పాల్గొన్నారు