చట్టసభల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి: వికారాబాద్ ఎంపీపీ కామిడి చంద్రకళ

Published: Tuesday March 09, 2021

వికారాబాద్ జిల్లా, మార్చి 08 ( ప్రజాపాలన ప్రతినిధి ) : చట్టసభల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని వికారాబాద్ ఎంపీపి కామిడీ చంద్రకళ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని క్లబ్ ఫంక్షన్ హాల్ లో బలహీన వర్గాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంఘం అధ్యక్షుడు వెంకట్ రాములు సమక్షంలో 107 వ అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆడపిల్ల పుట్టగానే లక్ష్మీదేవి పుట్టిందని సంతోషించాలి అని పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. మహిళలు సాధించుకోవాలని అనుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదని అన్నారు. యత్ర నార్యంతు పూజ్యతే రమంతే తత్ర దేవతాః అనగా ఎక్కడైతే స్త్రీలు గౌరవింప బడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కరాటే మాస్టర్ స్వాతి రాష్ట్ర సహాయ కార్యదర్శి వి అమరేశ్వర్ రాష్ట్ర కార్యదర్శి శంకర్ వెంకటేశ్వరరావు స్కైలాబ్ బాబు మల్లేష్ పాల్గొన్నారు