పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి

Published: Friday November 04, 2022
మంచిర్యాల బ్యూరో, నవంబర్ 3, ప్రజాపాలన  :
 
రైతుల సౌకర్యార్థం జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగిందని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలో గల కలెక్టర్ చాంబర్లో జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్తో కలిసి జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధర చెల్లించి రైతుల నుండి నాణ్యమైన పత్తి కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు.  జిల్లాలోని బెల్లంపల్లి, తాండూర్ లలో 8 వేల 100 రూపాయల మద్దతు ధరతో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగిందని తెలిపారు. 2022-23 సంవత్సరానికి గాను జిల్లాలో 1 లక్షా 54 వేల 853 ఎకరాలలో దాదాపు 15 లక్షల క్వింటాళ్ళ పత్తి సాగు జరుగుతుందని తెలిపారు. జిల్లాలో 7 పత్తి కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుండి పత్తి కొనుగోలు చేయడం జరుగుతుందని, మిగతా 5 కేంద్రాలలో సోమ, మంగళ వారాలలో కొనుగోళ్ళు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి కల్పన, మార్కెటింగ్ అధికారి గజానంద్, జిన్నింగ్ మిల్లుల యజమానులు,
మార్కెట్ కమిటీ కార్యదర్శులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.