అటవీ శాఖ భూమి ఆక్రమించలేదు * హరివిల్లు రిసార్ట్ వ్యవస్థాపకుడు పి గంగాధర్ రావు

Published: Monday December 05, 2022
వికారాబాద్ బ్యూరో 04 డిసెంబర్ ప్రజా పాలన : అటవీ శాఖకు సంబంధించిన భూమిని ఆక్రమించలేదని హరివిల్లు రిసార్ట్ వ్యవస్థాపకుడు పి గంగాధర్ రావు అన్నారు. హరివిల్లు రిసార్ట్ ను నేను కొన్న భూమి చట్టబద్ధమైనదని తెలిపారు. ఆదివారం మున్సిపల్ పరిధిలోని హరిత విల్లు రిసార్టులో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను కొన్న భూమికి సంబంధించి సంయుక్త సర్వే నిర్వహించి నిజా నిజాలు తేల్చాలని డిమాండ్ చేశారు. చీటికిమాటికి అటవీశాఖ అధికారులు హరిత విల్లు రిసార్ట్ కు వచ్చి భూ ఆక్రమణ చేశారని ఆరోపణలు చేయడం తగదని హితవు పలికారు. సంయుక్త సర్వే విచారణలో అటవీ శాఖకు సంబంధించిన ఒక్క ఇంచు భూమి తేలితే హరివిల్లు రిసార్టును మూసేస్తానని సవాల్ చేశారు. హరివిల్లు రిసార్టులో భూ ఆక్రమణ జరిగినట్లు రుజువైతే నాపై చట్టపరంగా చర్యలు తీసుకునే హక్కు అటవీ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులకు ఉంటుందని గుర్తు చేశారు. సంయుక్త సర్వేలో అటవీ శాఖ భూమి అని తేలితే వెంటనే భూమికి కంచవేసుకునే హక్కు అటవీ శాఖకు ఉంటుందని తెలిపారు. నేను కొన్న భూమికి పక్కా సరిహద్దులు ఉన్నాయని విశ్వాసం వ్యక్తం చేశారు. వికారాబాద్ అటవీశాఖ అధికారులు నోటీసు నా పేరు పెట్టి ఇవ్వకుండా నా భార్య లత పేరు పెట్టి ఇచ్చారని చేశారు. ఫారెస్ట్ అధికారులు నాపై అసత్య ప్రచారాలు చేసి హరివిల్లు రిసార్టుపై కక్ష సాధింపు చర్యలకు పూనుకోవడం మంచి పద్ధతి కాదని అన్నారు. అటవీ శాఖ అధికారులు నన్ను వ్యక్తిగతంగా లక్ష్యం చేసి మనోవేదనకు గురి చేయడం సబబు కాదన్నారు. అటవీ శాఖ అధికారులపై నేను ఎప్పుడూ దొరుసుగా ప్రవర్తించలేదని గంటాపతంగా చెప్పారు. అటవీ శాఖ అధికారులను దూషించినట్లు అసత్య ప్రచారాలు చేయడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని స్పష్టం చేశారు. అటవీశాఖ అధికారులు నోటీసు ఇవ్వడానికి ఒకరిద్దరు వస్తే సరిపోతుంది, కానీ ఒకేసారి గుంపుగా వచ్చి నోటీసులు అందజేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. హరివిల్లు రిసార్టును కొనసాగించుటకు హైకోర్టు అనుమతి కూడా ఉందని గుర్తు చేశారు. వికారాబాద్ ప్రాంత అభివృద్ధికి చేస్తున్న కృషిని అభినందించాల్సింది పోయి కక్షగట్టి మళ్లీమళ్లీ భూ ఆక్రమణ జరిగిందని నోటీసులు పంపడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఏ సమస్య అయినా శాంతియుతంగా చట్టపరంగా పరిష్కరించుకోవాలని సూచించారు.