ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత

Published: Friday July 02, 2021
మళ్ళీ మళ్ళీ భూకబ్జాలకు యత్నిస్తే పిడి యాక్ట్ నమోదు చేస్తాం
ఉప్పల్ తహసీల్దార్ కె. గౌతమ్ కుమార్
మేడిపల్లి, జూలై 01 (ప్రజాపాలన ప్రతినిధి) బండ్లగూడ, ఫతుల్లగూడ గ్రామ పరిధిలోని ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 58లో అక్రమంగా రాత్రికి రాత్రి నిర్మిస్తున్న 5గదులు, 3గుడిసెలు, 2కాంపౌండ్ వాల్ మరియు 3బేస్మెంట్లను ఉప్పల్ మండల రెవెన్యూ అధికారులు స్థానిక ఎల్.బి. నగర్ పోలీసుల సహాయంతో కూల్చివేశారు.ఈ సందర్బంగా తహసీల్దార్ గౌతమ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ భూముల్లో ప్లాట్స్ గా చేసి నోటరీల ద్వారా అమ్మడం, కొనడం నేరమని ప్రజలు మోసపోవద్దని సూచించారు. కొంతమందిపై గత సంవత్సరం ప్రభుత్వ భూమి అక్రమణకు యత్నిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేశామని అయినప్పటికీ కొందరు గత నెలరోజుల క్రింద కోవిడ్ లాక్ డౌన్ అదునుగా చేసుకొని మరలా భూక్రమణకు యత్నిస్తే మరోసారి కేసు నమోదు చేశామని, ఇలా మళ్ళీ మళ్ళీ భూకబ్జాలకు ప్రయత్నిస్తే పిడి యాక్ట్ ప్రయోగించి కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ తో పాటు స్థానిక ఇన్స్పెక్టర్ అశోక్ రెడ్డి, ఎస్.ఐ మహేందర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ షాహీన్ బేగం, వీఆర్వో స్వాతి, వీఆర్యేలు స్వామి, నరేందర్, సుమన్, సంజీవ, చంద్రకళ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.