ప్రజావాణి సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక శ్రద్ధ జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి

Published: Wednesday September 14, 2022
మంచిర్యాల బ్యూరో,   సెప్టెంబర్ 12, ప్రజాపాలన  :
 
ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తుదారులు చేసుకున్న అర్జీలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందకు సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో పరిష్కరించేందుకు కృషి చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలోని కలెక్టర్ చాంబర్లో అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. జన్నారం మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన నోముల రాజేందర్ తనకు పొనకల్ గ్రామ శివారులో 16 ఎకరాలు 6 గుంటల భూమి ఉండగా 13 ఎకరాల 36 గుంటల భూమిని విక్రయించామని, మిగతా భూమిని కొందరు కబ్జా చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ఇట్టి విషయంపై తగు విచారణ జరిపి పట్టాదారు పాసు పుస్తకం ఇప్పించి న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. జైపూర్ మండలం సర్వ గ్రామానికి చెందిన గోదరి లింగయ్య తనకు సర్వ గ్రామ శివారులోని భూమిని మరొక వ్యక్తి తప్పుడు పత్రాలతో తన పేరిట మార్చుకొని విక్రయించడం జరిగిందని, ఈ విషయమై విచారణ జరిపి న్యాయం చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం ఎర్రగుంట గ్రామానికి చెందిన భుక్య శ్రీనివాస్ తనకు దండేపల్లి మండలం మేదరిపేట గ్రామ శివారులో నివాస స్థలం ఉందని, ఇట్టి భూమికి సంబంధించి నాలా కన్వర్షన్ కూడా పొందియున్నానని, ఇల్లు నిర్మించుకొనుటకు అనుమతి మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. కాసిపేట మండల కేంద్రానికి చెందిన దుర్గం కిష్టయ్య తనకు 57 సం॥లు ఉన్నాయని, నిరుపేద అయిన తనకు వృద్ధాప్య ఫించన్ ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. దండేపల్లి మండల కేంద్రానికి చెందిన ఇమ్మిడిశెట్టి శంకరయ్య తన దరఖాస్తులో దండేపల్లి శివారులోని తనకు చెందిన భూమిని ఇతరులు కబ్జా చేసి భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, తగు చర్యలు తీసుకొని న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో అందించిన దరఖాస్తులకు ఆయా సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.