ఈనెల 20 నుండి వరి ధాన్యం కొనుగోలు

Published: Tuesday November 08, 2022
రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్ అనిల్ కుమార్ 
వికారాబాద్ బ్యూరో 7 నవంబర్ ప్రజా పాలన : ఈనెల 20 నుండి నిర్వహించే వరి ధాన్య కొనుగోలు కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్ అనిల్ కుమార్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ నిఖిలతో కలిసి కమిషనర్ రైస్ మిల్లర్లతో సమావేశమయ్యారు.  ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలతో పాటు ధాన్యం నిలువలకై అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తగు ఏర్పాట్లు చేయాలని సూచించారు.  బియ్యాన్ని నేరుగా ఎఫ్ సిఐ కి అందజేస్తున్నందున  రైస్ మిల్లర్లు నాణ్యమైన బియ్యాన్ని అందించేందుకు సాటెక్స్ మిషన్లను బిగించుకోవాలని  తెలిపారు.  అదేవిధంగా పోషకాహార బియ్యం గింజలను మిక్సింగ్ చేసేందుకుగా బ్లెండింగ్ యంత్రాలను ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. జిల్లాలో ఉన్న 58 రైస్ మిల్లర్ల యాజమాన్యాలు సహకరించి నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించేందుకు తోడ్పడాలని ఆయన కోరారు. మిల్లర్ల సమస్యలను కూడా కమిషనర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల ధాన్య సేకరణ జనరల్ మేనేజర్ రాజిరెడ్డి,  జిల్లా రెవెన్యూ అధికారి అశోక్ కుమార్,  జిల్లా పౌరసరఫరాల అధికారి రాజేశ్వర్, పౌరసరఫరాల మేనేజర్ విమల, రైస్ మిల్లర్ల జిల్లా అసోసియేషన్ కార్యదర్శి శ్రీధర్ రెడ్డిలతో పాటు రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.