ఉద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న రాష్ట్రప్రభుత్వం: మండల కాంగ్రెస్ అద్యక్షుడు గాలి దుర్గ

Published: Wednesday January 12, 2022
బోనకల్, జనవరి 11 ప్రజాపాలన ప్రతినిధి: రాష్ట్రంలో ఉద్యోగుల విభజన అంతా ఆగమాగంగా నడుస్తున్నదని, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో ఉద్యోగులు, టీచర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాలి దుర్గా రావు అన్నారు. కేడర్​ విభజన కోసం రాష్ట్ర ప్రభుత్వం జీవో 317ను తీసుకొచ్చింది. ఇది సరైన పద్ధతి కాదని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తెరాస ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అంతర్ జిల్లాల  బదిలీల్లో భాగంగా 26 మంది పంచాయతీ కార్యదర్శులను పక్కకు పెట్టిన విషయంపై ఆయన మాట్లాడుతూ, కాంట్రాక్ట్ పద్ధతిన పంచాయతీలలో పని చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులను నియమించుకుందని, ప్రభుత్వ ఉద్యోగం కావడం చేత ప్రైవేట్ రంగంలో మంచి  కొలువులో ఉన్నా దాన్ని వదులుకొని వచ్చి  సుమారుగా 10 నెలలుగా విధులు నిర్వహించారని, ప్రభుత్వం చేపట్టిన బదిలీలలో భాగంగా ఖమ్మం జిల్లాలో 26 మంది కార్యదర్శులను తొలగించారని, రాష్ట్ర వ్యాప్తంగా 800 మంది వరకు ఉన్నారని, లక్ష ఉద్యోగాలు ఇస్తాం, ఇంటికో ఉద్యోగం ఇస్తాం అన్నమాట దేవుడు ఎరుగు కానీ ఉన్న వారిని తీసి వేస్తూ ప్రభుత్వం ఉద్యోగుల, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని, దీనిని కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తుందని ఆయన అన్నారు. ఉన్న ఉద్యోగులను తొలగిస్తూ వారి పొట్ట మీద కొట్టడం ఏ మాత్రం సరైనది కాదని, అలాగే భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగులు, నిరుద్యోగులు అంత ఏకమై తెరాస పార్టీ చేస్తున్న వికృత చేష్టలకు తగిన గుణపాఠం చెప్పాలని, వారందరి తరుపున కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని తెలియజేశారు.