దూర విద్య - భారం

Published: Tuesday August 03, 2021

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని విశ్వ విద్యాలయాలకు ఉప- కులపతులను మరియు ఇతర అధికారులను రాష్ట్ర ప్రభుత్వం నియమించిన తరువాత విద్యా ప్రమాణాల మెరుగుదల ఏమో? కానీ ఫీజుల పెరుగుదల మాత్రం అమలు చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేధన చెందుతున్నారు. కరోనా మహమ్మారితో ప్రపంచం అంతా అతలా కుతలం అయిన  సంగతి అందరికి తెలిసిన విషయమే. ఇలాంటి గడ్డు కాలం నుండి ఇంకా బయట పడనే లేదు.  అంబేద్కర్  సార్వత్రిక విశ్వ విద్యాలయం పి.జీ. పరీక్షల రుసుము పెంచడం ప్రస్తుత పరిస్థితులలో సబబు కాదని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. దూర విద్య భారమౌతుందని ఆవేధన చెందుతున్నారు. గతంలో ఒక సెమిస్టర్ లోని ఒక్కో సబ్జెక్టుకు రూపాయలు 150/- ఉన్నది. అంటే ఒక సెమిస్టర్ లో ఐదు సబ్జెక్టులకు గాను రూపాయలు 750/- వసూలు చేసేది. ఆ విధంగానే కొందరి విద్యార్థుల తల్లిదండ్రులు పరీక్షల రుసుం ఆన్ లైన్ ద్వారా జులై నెల 31వరకు చెల్లింపులు చేసినట్లు తెలిపినారు. తదుపరి ఆగస్టు ఒకటవ తేదీ నుండి ఒక సెమిష్టర్ లోని ఐదు సబ్జెక్టులకు గాను రూపాయలు 1000/- వసూలు చేస్తున్నారు (రూపాయలు 250/- పెంచారు). కరోనా మూలంగా విద్య వెనక బడిపోయినది. ఈ గడ్డు కాలంలో యునివర్సిటి పి.జీ. పరీక్షల ఫీజులు పెంచడం భావ్యం కాదంటున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. అందరికి విద్య అనే నినాదంతో విద్యాలయాలు పనిచేయాలి. అంబేద్కర్ విశ్వవిద్యాలయం నూతన ఉప కులపతి గారు పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత విశ్వ విద్యాలయంలో నూతన కార్యక్రమాలు ప్రవేశపెట్టినారు. వ్యక్తిగత కుటుంబ ఆర్థిక కారణాల వలన చదువును మద్యలో ఆపేసిన విద్యార్థుకు తిరిగి చదువును కొనసాగించడానికి గొప్ప అవకాశం కల్పించారు. కాని పిజీ పరీక్షల రుసుం పెంచడం సరియైనది కాదని అంబేద్కర్ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఈ విషయంను పునఃపరిశీలించి పెంచిన పరీక్షల రుసుమును అమలు చేయరాదని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.