మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ కేంద్రాలుగా మార్చాలి

Published: Thursday July 28, 2022
మంచిర్యాల టౌన్, జూలై 27, ప్రజాపాలన: మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ కేంద్రాలుగా మార్చాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్,  హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటి పిలుపు మేరకు బుధవారం  రోజున జిల్లా కేంద్రంలోని ఐసిడిఎస్ పిడి కార్యాలయం ముందు ధర్నా  చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు భానుమతి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ ఈనెల 12వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన సర్కులర్ లో జనాభా, లబ్ధిదారుల ప్రాతిపదికన అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ కేంద్రాలుగా మారుస్తామని ప్రకటించిందని, కాని మినీ అంగన్వాడి కేంద్రాలు దాదాపు చిన్న గ్రామాలు, తండాలు, గూడేలల్లో ఉంటాయని జనాభా కూడా తక్కువ ఉంటుందని దీనివల్ల లబ్దిదారుల సంఖ్య  తగ్గుతుందని వారు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మినీ అంగన్వాడీల బాధలు అర్థం చేసుకొని ఎలాంటి షరతులు లేకుండా మెయిన్ కేంద్రాలుగా మార్చాలని డిమాండ్ చేశారు. లేనియెడల సిఐటియు ఆధ్వర్యంలో మినీ అంగన్వాడీల పోరాటం ఉదృతం చేస్తామని  హెచ్చరించారు. ఈ  కార్యక్రమంలో శ్యామల, విజయ, శోభ, యశోద, వీణ, మహేశ్వరీ తదితరులు పాల్గొన్నారు.