అవెన్యూ ప్లాంటేషన్ కు గుంతలు సిద్ధం చేయాలి

Published: Wednesday June 08, 2022
డిప్యూటీ సీఈఓ సుభాషిణి
వికారాబాద్ బ్యూరో జూన్ 07 ప్రజా పాలన : రాబోవు వర్షాకాలం నాటికీ అవెన్యూ ప్లాంటేషన్ చేయుటకు మొక్కలు సిద్ధం చేయాలని సిద్దులూరు, కొటాలగూడ సర్పంచులకు కార్యదర్శులకు డిప్యూటీ సీఈఓ సుభాషిణి ఆదేశించారు. మంగళవారం వికారాబాద్ మండల పరిధిలోని సిద్దులూరు, కొటాలగూడ గ్రామాలలో గ్రామ సర్పంచులు బంటు ఆంజనేయులు ముదిరాజ్ రాములు నాయక్ కార్యదర్శులు మధుకర్ రెడ్డి, రామకృష్ణ లతో కలిసి రోడ్డుకు ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ కొరకు గుంతలు తవ్వే కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఈఓ మాట్లాడుతూ ఐదవ విడత పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ప్రతి గ్రామం ప్రణాళికాబద్ధంగా పల్లె ప్రగతి కార్యక్రమాలను రోజువారీగా నిర్వహించాలని సూచించారు. ప్రజలందరూ భాగస్వాములై పల్లె ప్రగతిని విజయవంతం చేయాలని కోరారు. ప్రతి గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేపట్టి ప్రజలు రోగాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హితువు పలికారు. ప్రతి గ్రామం వృక్ష సంపదతో కళకళలాడాలని సర్పంచులకు కార్యదర్శులకు సూచించారు. వృక్ష సంపదతో గ్రామాలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయని తెలిపారు. పల్లె ప్రగతితో ప్రతి గ్రామం పట్టణాలతో పోటీ పడాలని స్పష్టం చేశారు. అవెన్యూ ప్లాంటేషన్ కొరకు గుంతలు తవ్వి కార్యక్రమంలో గ్రామ ప్రజలు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.