చిరు పండ్ల వ్యాపారులపై ట్రాఫిక్ పోలీసుల జులుం

Published: Thursday September 29, 2022
 బాధిత పండ్ల వ్యాపారులు సోహెల్, ఉమర్
వికారాబాద్ బ్యూరో 28 సెప్టెంబర్ ప్రజా పాలన : రెక్కాడితేగాని డొక్కనిండని చిరు పండ్ల వ్యాపారులపై ట్రాఫిక్ పోలీసులు జులుం చేస్తున్నారని బాధిత పండ్ల వ్యాపారులు సోహెల్, ఉమర్ విమర్శించారు. జిల్లా కేంద్రంలోని బీజెఆర్ చౌరస్తాలో మంగళవారం రాత్రి తోపుడుబండ్ల పండ్ల చిరు వ్యాపారులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బూటు కాళ్లతో తన్ని చెంపలపై బాదుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు . కుటుంబాన్ని పోషించుకొనుటకు అప్పులు తెచ్చి తోపుడుబండ్లపై పండ్ల వ్యాపారం చేస్తున్నామని విక్రయదారులు అన్నారు. తోపుడు పండ్ల బండి దగ్గర రోజంతా నిలబడి పండ్లు విక్రయిస్తే సుమారుగా మూడు నాలుగు వందల రూపాయలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తోపుడుబండ్లపై పండ్ల వ్యాపార చేసుకునే వ్యాపారులపై ట్రాఫిక్ పోలీసులు దౌర్జన్యంగా దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కు వ్యతిరేకంగా తోపుడుబండ్లు పెట్టి పండ్లు విక్రయిస్తున్నారని ట్రాఫిక్ పోలీసులు బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు. డబ్బులు ఇవ్వకపోతే చలాన్లు రాసి పోలీస్ స్టేషన్కు పిలిపించుకొని చితకబాదుతున్నారని ఆరోపించారు. ట్రాఫిక్ పోలీసులు పండ్ల వ్యాపారులను పోలీస్ స్టేషన్ కు పిలుపించుకొని సెల్ ఫోన్లు లాక్కొని బూతు మాటలు మాట్లాడుతున్నారని చెప్పారు. ఎందుకు పోలీస్ స్టేషన్కు పిలిపించారని పండ్ల వ్యాపారులు ప్రశ్నిస్తే బట్టలు ఊడదీసి కొడతామని బెదిరిస్తున్నారు. మేము ఏ దొంగతనము, దోపిడీ చేయడం లేదు. కానీ మమ్మల్ని గొడ్డును బాదినట్లు బాదుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.