ఉపకార వేతనాల దరఖాస్తులు ఆధార్ అనుసంధానం

Published: Friday August 13, 2021
జిల్లా ఆదనపు కలెక్టర్ మోతిలాల్
వికారాబాద్ బ్యూరో 12 ఆగస్ట్ ప్రజాపాలన : నిరుపేద విద్యార్థులు అందరికీ ఉపకార వేతనాలు అందేలా కళాశాలల ప్రిన్సిపాల్స్ చూడాలని జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ సూచించారు. గురువారం మద్గుల్ చిట్టంపల్లి లోని డిపిఆర్సి భవన్ లో జూనియర్, డిగ్రీ, పీజీ, డైట్ కళాశాలల ప్రిన్సిపాల్స్ తో పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల చెల్లింపు పై సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ సందర్బంగా జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ 2017-18 నుండి 2020-21 వరకు జిల్లాలోని అన్ని కళాశాలల్లో కొత్తగా 37,688 దరఖాస్తులు వచ్చాయని, 37,242 దరఖాస్తులు రినివల్ కాగా మొత్తం కలిపి 74,830 దరఖాస్తులలో SC లు 12,517, ST లు 7655, BC లు 35,235 మరియు మైనారిటీ లకు 8,842 ఉపకార వేతనాలు మొత్తం కలిపి 64,249 మందికి మంజూరు చేయడమైనదని తెలియజేసినారు. జిల్లాలో 2017 నుండి 2020 వరకు ఇంకను 10,581 ఉపకార వేతనాల దరఖాస్తులు ఆధార్ అనుసంధానం తదితర కారణముల వల్ల పెండింగ్ లో ఉన్నాయని తెలియజేసినారు. ఇట్టి పెండింగ్ దరఖాస్తులను వెంటనే మంజూరు చేసేందుకు కళాశాల ప్రిన్సిపాల్స్ తక్షణమే చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా నిరుపేద విద్యార్థులకు సకాలంలో ఉపకార వేతనములు అందేవిధంగా చూడాలని సూచించారు. ఈ సమావేశంలో డిఎస్సిడిఓ మల్లేశం, డిటిడిఓ కోటాజి, డిబిసిడిఓ పుష్పలత, డిఎండబ్ల్యూఓ సుధారాణి కళాశాలల నోడల్ అధికారి శంకర్ నాయక్, జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల ప్రిన్సిపాల్స్ తదితరులు పాల్గొన్నారు.