ఉపాధ్యాయుల ఉద్యమ నేత నాగటి నారాయణ మృతి చదువుకోమని ప్రోత్సహించేవారు లేక ఆష్ట కష్టాలు పడ్డ న

Published: Tuesday October 11, 2022
బోనకల్, అక్టోబర్ 10 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలోని పెద్ద బీరవల్లి గ్రామానికి చెందిన 3 దశాబ్దాల పాటు యూటీఎఫ్ నాయకుడిగా ఉన్న నాగటి నారాయణ అనారోగ్యంతో హైదరాబాద్ ఆసుపత్రిలో సోమవారం మృతి చెందారు.నాగటి నారాయణ నిరుపేద దళిత కుటుంబంలో పుట్టాడు. పెద్ద బీరువెల్లి గ్రామంలో ఆనాడు దళితవాడ నుండి బడికి వెళ్ళేది నారాయణ ఒక్కడే. నారాయణకు సామాజిక, ఆర్థిక అంతరాలు ఎన్నో అడ్డుగోడలుగా ఉంటాయి. చదువుకొమ్మని ప్రోత్సహించే వాళ్ళు లేక ఎన్నో ఇబ్బందులు పడ్డారు. గ్రామ ప్రజలు కమ్యూనిస్టు పార్టీ ప్రభావంలో ఉండటంతో ఆయనతో దయతో ఉండేవారు. యువకునిగా ఉన్నప్పుడు ఒక నాటకంలో నారాయణ హీరోగా నటించారు. అది పెద్ద హిట్ అయింది. అందరూ మెచ్చుకున్నారు. దళితవాడలో చైతన్యానికి ఆ సంఘటన నాంది పలికింది. నారాయణ కు అతి చిన్న వయసులోనే వివాహం జరిగింది. బ్రతుకు తెరువు కోసం ఆమె కూలికెళ్తూ భర్తను టిటిసి చేయించింది. 1980లో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో నారాయణకు ఉద్యోగం వచ్చింది.
నారాయణకు అనుభవించిన పేదరికం కలిసివేసింది. అక్కడ పరిస్థితులు చూసి నారాయణ తిరగబడ్డాడు. దీంతో గుండాల మండలం అనంతోగు దండకారణ్యంనకు బదిలీ చేయించాడు. ఆనాడు డిటిడబ్ల్యూఓగా ఉన్న ఖదీర్ 
ఐటిడిఎను జాగీరుగా తాను నవాబుగా హెడ్ మాస్టర్లను పాలెగాళ్ళు గా టీచర్లను దద్దమ్మలు గా పిల్లలను బానిసలుగా చూసేవాడు. ఎదురు తిరిగిన వాళ్లను బదిలీలు చేస్తూ లొంగ దీసుకునేవాడు. నారాయణ ఆనాడు భద్రాచలం మార్క్సిస్టు పార్టీ అగ్ర నాయకులుగా ఉన్న బండారు చందర్రావు, బత్తుల భీష్మారావు ను కలిసి విషయం చెప్పాడు. వాళ్ళిచ్చిన వార్నింగ్ తో ఖదీర్ నారాయణ బదిలీని రద్దు చేశాడు. ఆనాడు అదొక పెద్ద సంచలనాన్ని సృష్టించింది. అందరూ నారాయణను హీరోలా చూశారు. అప్పటికే ఖదీర్ నిరంకుశత్వాన్ని ఎదిరిస్తున్న సయ్యద్ జియావుద్దీన్, జి మాధవరావు, గోపిచంద్ మరి కొందరితో నారాయణకు పరిచయం ఏర్పడింది. అందరు కలిసి గిరిజన సంక్షేమ ఉపాధ్యాయ ఉద్యమానికి పదును పెట్టారు.ఆనాడు ఐటిడిఎ ఆఫీస్ పాల్వంచ లో ఉండేది. డి టి డబ్ల్యూ ఓ తనకు నచ్చిన వారికి పదోన్నతులు ఇవ్వడం, బదిలీలు చేస్తుండటంతో యుటిఎఫ్ ఆధ్వర్యంలో 1981లో పెద్ద ఎత్తున ఉపాధ్యాయులను కదిలించి ధర్నా చేశారు. అధికారుల ఇష్టారాజ్యం చెల్లదనీ హెచ్చరించారు. ఐటిడిఏ చరిత్రలో ఆ పోరాటం ఒక మైలురాయిగా నిలిచి పోయింది. ఆ తర్వాత గిరిజన సంక్షేమ పాఠశాలలకు పోస్ట్లు ఇవ్వాలని చేసిన పోరాటాల ఫలితంగా 1989లో ఓబీబీ స్కీం లో 500 టీచర్ పోస్టులు మంజూరయ్యాయి. స్థానిక గిరిజన యువతను ఉపాధ్యాయులు గా నియమించాలని చేసిన పోరాటం వల్ల జీవివీకే ఉపాధ్యాయులు వచ్చారు. వారికి శిక్షణ ఇవ్వాలని, అందుకోసం ఉట్నూరు, అరకు లోయలో సబ్ డైట్స్ పెట్టించారు. గిరిజన ఉపాధ్యాయులకు టైం స్కేల్ ఇప్పించడంలో, నోషనల్ ఇంక్రిమెంట్లు సాధనలో విజయం సాధించారు. గిరిజన, గిరిజనేతరులు యుటిఎఫ్ సంఘంలో సభ్యులుగా చేరారు.రాశిలో, వాసిలో సంఘం బలం, ప్రతిష్ట పెరిగిపోయింది. ఖమ్మం జిల్లాలో వస్తున్న మార్పులను చూసి ఇతర 9 ఏజెన్సీ జిల్లాలు ప్రేరణ పొందేవి. రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన సంక్షేమ ఉపాధ్యాయులను ఐక్య పరచడం కోసం రంపచోడవరం లో, భద్రాచలంలో రెండుసార్లు నిర్వహించిన రాష్ట్ర సదస్సులకు మంత్రులు, ఉన్నతాధికారులు హాజరై సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.ఆ సదస్సుల్లో జరిగిన చర్చలు నిర్వహణ స్ఫూర్తితో వందలాది మంది ఉపాధ్యాయులు కార్యకర్తలుగా రాణించారు. ఆ ఉద్యమాల ఫలితంగా నారాయణకు గొప్ప గౌరవం, సముచిత స్థానం లభించింది.ఆ తర్వాత ఖమ్మం జిల్లా అధ్యక్షునిగా, ప్రధాన కార్యదర్శిగా నారాయణ బాధ్యతలు నిర్వహించాడు. తర్వాత దాచూరి రామిరెడ్డి, అప్పారి వెంకటస్వామి వారసునిగా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి గా బాధ్యతలు నిర్వహించ డానికి సిద్ధాంతం ఆచరణ మేళవించి పనిచేసే ప్రతిభ, సామర్థ్యాలను నారాయణ లో గుర్తించి అత్యున్నత స్థానంలో ఉంచింది యుటిఎఫ్ సంఘం. ఒక దశలో అంతటి బాధ్యతలు నేను నిర్వహించగలనా అనే జంకు ఆయనలో ఉండేది. ఆయనను వెన్నుతట్టి ముందుకు నడిపించింది అమరజీవి విఎల్ నరసింహారావు. సామాజిక న్యాయం సాధించడం అనేది ఒక యుటిఎఫ్ తోనే సాధ్యంమని, అస్తిత్వవాద సంఘాల వల్ల అది జరిగే పని కాదని నిరూపించాడు. ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు నారాయణ ఎంతో ఉత్తేజాన్ని నింపారు.