అధికారులరా మేల్కొనండి మా గోడు వినండి మమ్మల్ని రక్షించండిప్రాణ నష్టం జరగకముందే మరమ్మతులు చే

Published: Friday November 18, 2022

ఘకుంగిన దెందుకూరు బ్రిడ్జిసైడ్ వాళ్ళు విరిగిన మీనవోలు బ్రిడ్జిగుంతల మయంగా బోనకల్ బ్రిడ్జినియోజకవర్గ పరిధిలోని ఉన్న అనేక బ్రిడ్జీలు ప్రమాదకరంగా మారాయి. ప్రాణ నష్టం జరగకముందే అధికారులు బ్రిడ్జిలకు మరమ్మత్తులు చేపట్టాలని మధిర నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. మధిర నియోజకవర్గంలో దశాబ్దాల క్రితం నిర్మించిన బ్రిడ్జి లకు అధికారులు నేటి వరకు మరమ్మతులు చేపట్టకపోవడంతో కొన్ని బ్రిడ్జిపై గుంతలు ఏర్పడగా మరికొన్ని బ్రిడ్జిల రక్షణ గోడలు విరిగిపోయాయి. ఈ బ్రిడ్జిపై వాహన చోదకులు రాకపోకలు కొనసాగించాలంటే ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని ప్రయాణం చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి.గతంలో బ్రిడ్జిపై ఉన్న గుంతల్లో పడి మృత్యువాత గురైన సంఘటన కూడా అనేకం ఉన్నాయి. మధిర పట్టణానికి కూతవేటు దూరంలో వైరా నదిపై రాయపట్నం బ్రిడ్జి నిర్మించారు. అదేవిధంగా బోనకల్ గ్రామంలో నిర్మించిన ఆర్ఓబి మండలంలో కలకోట వద్ద వైరా నదిపై నిర్మించిన ఆర్ అండ్ బి బ్రిడ్జితో పాటు ఎర్రుపాలెం మండలం కట్టలేరు పై మీనవోలు వద్ద నిర్మించిన ఆర్ అండ్ బి బ్రిడ్జి మధిర మండలం దెందుకూరు వద్ద నిర్మించిన ఆర్ఓబి బ్రిడ్జిలు శిథిలావస్థకు చేరాయి. అనేక సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ బ్రిడ్జికి ఇప్పటివరకు ఎటువంటి మరమ్మతులు చేపట్టకపోవడంతో బ్రిడ్జిపై స్లాబ్ లేచిపోయి ఇనుప చువ్వలు బయటపడ్డాయి. రాత్రి వేళలో ప్రయాణం చేస్తున్న ద్విచక్ర వాహన చోదకులు ఇనుప చువ్వలు తగిలి ప్రమాదానికి గురైన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ బ్రిడ్జిపై మరమ్మతులు చేపట్టాలని అనేకసార్లు ఆర్ అండ్ బి అధికారులు దృష్టికి పట్టణ ప్రజలు, వివిధ రాజకీయ పార్టీ నేతలు తీసుకెళ్లినా అధికారుల్లో చలనం లేదు. గతంలో వివిధ రాజకీయ పార్టీ నేతలు స్వచ్ఛంద సంస్థలు ఉద్యమిస్తే మధిర ఆర్ఓబికి రాయపట్నం బ్రిడ్జికి మరమ్మతులు చేపట్టారు. మధిర మండలంలోని దెందుకూరు ఆర్ఓబిపై కూడా భారీ స్థాయిలో గుంతలు ఏర్పడ్డాయి. ప్రజలు నడిచేందుకు ఏర్పాటుచేసిన ప్లాట్ ఫారం సైతం కృంగిపోయింది. అంతేకాకుండా బ్రిడ్జికి ఇరుపక్కలు ఏర్పాటు చేసిన రక్షణ గోడలు సైతం విరిగిపోయాయి. బ్రిడ్జిపై ఉన్న గుంతల వద్ద ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో  ఒక వ్యక్తి మృతి చెందారు. దీంతో గ్రామ ప్రజలు, సర్పంచ్ వెంటనే చొరవ తీసుకుని బ్రిడ్జిపై తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. ఎర్రుపాలెం మండలం మీనవోలు బ్రిడ్జికి, బోనకల్ మండలం కలకోట బ్రిడ్జికి ఇరువైపుల నిర్మించిన రక్షణ గోడలు విరిగిపోయాయి. ద్విచక్ర వాహనదారులు ఆదమరిస్తే నదిలో పడిపోవడం ఖాయమని ప్రజలు చర్చించుకుంటున్నారు. బోనకల్లు రైల్వే ఓవర్ బ్రిడ్జి పై అడుగడుగునా గుంతలు ఏర్పడ్డాయి. బ్రిడ్జిపై ఉన్న స్లాబ్ లేచిపోవడం బ్రిడ్జి సువ్వలు బయటపడటంతో ఏ క్షణాన ఏం జరుగుతుందో అని ఆ బ్రిడ్జిపై ప్రయాణం చేసే వాహనదారులు భయంతో ప్రయాణాలను కొనసాగిస్తున్నారు. ఈ బ్రిడ్జిపై నిరంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జగ్గయ్యపేట సిమెంట్ పరిశ్రమల నుండి ఇతర ప్రాంతాలకు సిమెంట్ లారీలు భారీ స్థాయిలో రాకపోకలు కొనసాగుతాయి. అంతేకాకుండా కనీసం బ్రిడ్జికి రంగులు వేయలేదు. బ్రిడ్జిపై పారిశుధ్య అస్తవ్యస్తంగా ఉంది. ఇప్పటికైనా రోడ్ల భవనాల శాఖ అధికారులు స్పందించి మరింత ప్రాణ నష్టం జరగకముందే బ్రిడ్జిలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని మధిర, ఎర్రుపాలెం, బోనకల్ మండలాల నియోజవర్గ ప్రజలు కోరుతున్నారు.