జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ చైర్మన్ గా మాలె లక్ష్మణ్ గుప్తా ఏకగ్రీవంగా ఎంపిక

Published: Monday March 21, 2022
వికారాబాద్ బ్యూరో 20 మార్చి ప్రజాపాలన : ఒలింపిక్ క్రీడలలో అత్యంత ప్రాచుర్యం పొందిన సైక్లింగ్ పోటీలలో వికారాబాద్ జిల్లా నుండి పాల్గొనేటట్లు అవగాహన కల్పిస్తామని జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ చైర్మన్ మాలె లక్ష్మణ్ గుప్తా అన్నారు. ఆదివారం తెలంగాణ రాష్ట్ర సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షులు మల్ రెడ్డి చేతుల మీదుగా వికారాబాద్ జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ చైర్మన్ గా మాలె లక్ష్మణ్ గుప్తా నియామక పత్రాన్ని అందుకున్నారు. రాష్ట్ర అధ్యక్షులకు పుష్పగుచ్చం అందజేసి జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ చైర్మన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ చైర్మన్ మాలె లక్ష్మణ్ గుప్తా మాట్లాడుతూ జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ చైర్మన్ గా పదవీ బాధ్యతలు అప్పగించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలో సైక్లింగ్ పోటీలలో పాల్గొనేందుకు అవగాహన కల్పిస్తానని పేర్కొన్నారు. సైక్లింగ్ పోటీలను 4 విభాగాలలో నిర్వహించనున్నామని వివరించారు. అండర్ 14, అండర్-16 జూనియర్స్, సీనియర్స్ విభాగాలలో సైక్లింగ్ పోటీలు ఉంటాయని స్పష్టం చేశారు. సైక్లింగ్ పోటీలు నిర్వహించడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అవగాహన కల్పించి పోటీలు నిర్వహిస్తామని వెల్లడించారు. సైక్లింగ్ పోటీలను త్వరలో జిల్లా కేంద్రంలో నిర్వహించనున్నామని సైక్లింగ్ పోటీదారులకు తీపి వార్తను చెప్పారు. సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్ ఏర్పాటు అయినదని ఉద్ఘాటించారు. అంతకు ముందు వికారాబాద్ జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులను ఎంపిక చేశారు. వికారాబాద్ జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ సభ్యులుగా కె.వెంకటేష్, ఎం ఆనంద్ కుమార్, వి.హరికృష్ణ, జయదేవ్, ఆర్.సంతోష్, నర్సింలు, ప్రతాప్ రెడ్డి లు కొనసాగుతారు. జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ సభ్యుల పదవీ కాలం 4 సంవత్సరాలు ఉంటుంది.