జయసారదిరెడ్డి గెలుపును కోరుతూ సిపిఎం,సిపిఐ నాయకుల ప్రచారం

Published: Friday March 05, 2021

వలిగొండ ప్రజాపాలన: నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జయసారది రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతూ గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వేముల మహేందర్ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బోడ సుదర్శన్ లు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పట్టభద్రుల  సమస్యలపై నిరుద్యోగుల సమస్యలపై నిరంతరం పోరాడే వామపక్షాలు బలపరుస్తున్న ఎమ్మెల్సీ అభ్యర్థి జయసారది రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.కేంద్రంలోని బిజెపి రాష్ట్రంలోని తెరాస పాలకులు ఈ ఆరేళ్ల కాలంలో కనీసం నిరుద్యోగులు పట్టభద్రుల సమస్యల్ని ఏ మాత్రం పరిష్కారం చేసినటువంటి పరిస్థితి లేదన్నారు.నిరుద్యోగులు పట్టభద్రులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు.సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న బిజెపి అభ్యర్థిని,అదేవిధంగా రాష్ట్రంలో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి మోసం చేసిన టిఆర్ఎస్ అభ్యర్థులను ఓడించి వారికి తగిన గుణపాఠం చెప్పాలని వారు కోరారు.నిరంతరం ప్రజా సమస్యలపై గత అనేక సంవత్సరాలుగా పోరాడుతున్న సిపిఎం, సిపిఐ వామపక్షాలు బలపరుస్తున్న జయసారది రెడ్డికి ఓటు వేయడం ద్వారా అనేక నిరుద్యోగ పట్టభద్రుల సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు.అందుకే జయసారది రెడ్డి సీరియల్ నెంబర్ 2 లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.ఈ ప్రచారంలో సిపిఐ మండల కార్యదర్శి పోలేపాక యాదయ్య సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సిర్పంగి స్వామి, సిపిఎం, సిపిఐ  పట్టణ కార్యదర్శులు కూర శ్రీనివాస్, సల్వాది రవీందర్, సిపిఎం మండల కమిటీ సభ్యులు తుర్కపల్లి సురేందర్ సిపిఐ మండల నాయకులు వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.