ఎమ్మెల్యే మైనంపల్లి పై వస్తున్న అసత్య ఆరోపణలను ఖండిస్తున్నాం

Published: Wednesday April 27, 2022
హైదరాబాద్ (ప్రజాపాలన ప్రతినిధి) : మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పై భూమి కబ్జా చేశాడంటూ కొందరు మీడియా మాధ్యమాల్లో చేస్తున్న అసత్య ఆరోపణలు ఖండిస్తున్నాం అని శ్రీ వేంకటేశ్వర ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ తెలిపింది. ఈ మేరకు మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మహిపాల్ రెడ్డి విజయ్ ఎన్ రాజు లు మాట్లాడారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అల్వాల్ గల పాకాల కుంట (జొన్న బండ) గ్రామంలో సర్వే నెంబర్ 575 నుంచి 580 వరకు గల దాదాపు 150 ఎకరాల భూమిలో 25 ఎకరాల భూమి (367 ప్లాట్స్) ని 1996 సంవత్సరంలో స్థానిక ప్రజలైన తాము కొనుగోలు చేశామని తెలిపారు. ఇట్టి భూమిని 2005 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం అర్బన్ సీలింగ్ ల్యాండ్ (యు ఎల్ సి) ల్యాండ్ కింద డిక్లేర్ చేసిందని పేర్కొన్నారు.  తామందరం ప్రతి ఒక్క ఫ్లాట్ కి మళ్లీ ప్రభుత్వానికి డీడీ రూపంలో డబ్బులు చెల్లించి యు ఎల్ సి, ఎండార్స్మెంట్ సర్టిఫికెట్ల ద్వారా తాము అట్టి భూమి తిరిగి సొంతం చేసుకున్నామని తెలిపారు. 2010 సంవత్సరంలో 10 వేలు చెల్లించడం ద్వారా తమకు ల్యాండ్ రెగ్యులరైజేషన్ (ఎల్ఆర్ఎస్) కూడా లభించింది అని అన్నారు. కాగా ఇట్టి భూమిని 2020 సంవత్సరంలో హజీజ్ జీలాని అనే వ్యక్తి తమ పూర్వీకులదీ అంటూ వంద మంది రౌడీలతో అనేక మారణాయుధాలతో తమను బెదిరించి ల్యాండ్ స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ని కలిసి తమకు సహాయం చేయాల్సిందిగా కోరామని తెలిపారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే మాకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. దీంతో ఎలాగైనా ఎమ్మెల్యే పై బురదజల్లలనే ఉద్దేశంతో హజీజ్ జీలాని  అనే వ్యక్తి ఎమ్మెల్యే పై అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ రామ్ రెడ్డి ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.