క్రైస్తవులపై దాడులు జరిగితే ఊరుకోం.. టీసీసీ రాష్ట్ర అధ్యక్షులు బిషప్ సుదర్శనం..

Published: Wednesday January 25, 2023
కల్లూరు, జనవరి 24 (ప్రజాపాలన న్యూస్):
 
 సమాజంలో క్రైస్తవులందరూ ఐక్యంగా ఉండి తమ హక్కులను సాధించుకోవాలని తెలంగాణ క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు బిషప్ ఎం. డేవిడ్ సుదర్శనం అన్నారు. మంగళవారం ఖమ్మంజిల్లా కల్లూరులో టిసిసి జిల్లా కుటుంబసభ్యుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం హక్కులు ఉన్నాయని, ఎవరిష్టం వచ్చిన మతంలో స్వేచ్ఛగా ఉండవచ్చునన్నారు. క్రైస్తవులపై నిరంతరం దాడులు జరుగుతున్నాయని, వాటిని మనమందరం కలిసి తిప్పి కొట్టాలన్నారు. రానున్న రోజుల్లో క్రైస్తవులపై ప్రమాదకర సంఘటనలు జరిగే అవకాశం ఉన్నందునా ఇప్పటినుండి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా టీసీసీ అనుసరించే విధానాల గురించి ఆయన క్లుప్తంగా వివరించారు. తొలుత తెలంగాణ క్రిస్టియన్ కౌన్సిల్ 2023 నూతన క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోఆర్డినేటర్ రమేష్ బాబు, కన్వీనర్ నిరీక్షణ రావు, ఉపాధ్యక్షులు ఆనందరావు, జాయింట్ సెక్రెటరీ ఏసు పాదం, జార్జి ముల్లర్, జిల్లా అధ్యక్షులు మధు, వివిధ మండలాల టిసిసి ప్రతినిధులు, పాస్టర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.