ప్రజావాణి సమస్యల పరిష్కారం దిశగా ప్రత్యేక చర్యలు జిల్లా కలెక్టర్ బావ సంతోష్.

Published: Tuesday February 14, 2023
మంచిర్యాల బ్యూరో, ఫిబ్రవరి 13, ప్రజాపాలన  :
 
 
ప్రజావాణి  లో వచ్ఛిన అర్జీల పరిష్కారంలో సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలో గల కలెక్టర్ చాంబర్లో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మధుసూదన్ నాయక్, ట్రైనీ కలెక్టర్ పి.గౌతమితో కలిసి అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. చెన్నూర్ మండలం ఎల్లక్కపేట గ్రామానికి చెందిన చింతల కిష్టయ్య తనకు గ్రామ శివారులో భూమి ఉందని, తన ప్రక్క భూమి వారు కొలతల కోసం దరఖాస్తు చేసుకోగా సంబంధిత అధికారులు టిప్పన్ ను పరిగణలోకి తీసుకొకుండా కొలతలు చేసి నా భూమిలోకి రావడం జరిగిందని, ఈ విషయమై విచారణ జరిపి న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. మంచిర్యాల పట్టణానికి చెందిన దుర్గం స్వామి గర్శిళ్ళ శివారులో పునరావాసం, కులాంతర వివాహం, సహజీవన స్రవంతి, మాజీ సైనికులకు అందించిన భూమిని కొందరు తప్పుడు దస్తావేజులు, పత్రాలతో ఆక్రమించుకున్నారని, ఈ విషయమై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. దండేపల్లి మండలం చింతపల్లి గ్రామానికి చెందిన అక్కల పెద్దయ్య తాను 1992లో సాదాబైనామా ద్వారా గ్రామ శివారులో భూమిని కొనుగోలు చేశానని, ఇటీవల కొందరు మోకాపైకి వచ్చి తమ భూమిగా చెబుతున్నారని, ఈ విషయమై న్యాయం చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. కన్నెపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన దుర్గం రాజకుమార్ తన తాతల నుండి గత సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూమిని అటవీ హక్కుల చట్టం క్రింద పట్టా చేసి ఇవ్వాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. మంచిర్యాల మండల కేంద్రానికి చెందిన రావి మనోహర్ చెన్నూర్ మండలం నాగాపూర్ శివారులో తన సోదరులతో కలిపి జాయింట్ పట్టా కలిగి ఉన్నామని, ఇందులో తన సోదరుడైన రావి లక్ష్మీనారాయణ మిగతా వారికి తెలియకుండా భూమిని విక్రయించగా వారు పట్టా చేసుకున్నారని, ఈ లావాదేవీని, పట్టాను రద్దు చేసి ఇట్టి భూమిని జాయింట్ రీస్టోర్ చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. మందమర్రి మండలం రామకృష్ణాపూర్కు చెందిన అలువాక సత్తయ్య, అలవోయిన గంగయ్యలు తమకు చెందిన భూమి రైల్వే ఓవర్ బ్రిడ్జి క్రింద పోగా సంబంధిత నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. బెల్లంపల్లి మండలం ఆకెనపల్లి గ్రామానికి చెందిన వంగల సత్యనారాయణ తన గ్రామ శివారులో గల భూమిని కొందరు కబ్జాదారులు దౌర్జన్యంగా ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని, ఈ విషయమై తనకు న్యాయం చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. చెన్నూర్ మండలం అంగ్రాజ్పల్లి గ్రామానికి చెందిన రత్న రోహిత్, రత్న సత్యనారాయణరెడ్డి తమకు చెందిన పట్టా భూమిని బ్లాక్స్ట్లో చేర్చడం జరిగిందని, దీనిని సవరించాలని కోరుతూ వేర్వేరుగా దరఖాస్తు అందజేశారు. మంచిర్యాల పట్టణానికి చెందిన జాడి రాజమల్లు తనకు నస్పూర్ శివారులో గల భూమిని కొందరు ఆక్రమించుకున్నారని, దీనిపై విచారణ జరిపి నూతన పట్టాదార్ పాస్ పుస్తకంతో పాటు ధరణి వెబ్సైట్లో తన పేరు నమోదు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. నస్పూర్ మండలం తీగల్పహాడ్ గ్రామానికి చెందిన గుర్రాల వంశీకృష్ణ తన తాత పేరిట గల ఇంటిని తమకు తెలియకుండా పెద్దనాన్న కుమారుడు తమ పేరిట మార్చుకున్నాడని, దీనిపై విచారణ జరిపి న్యాయం చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. మంచిర్యాల పట్టణంలోని రాజీవ్ నగర్కు చెందిన ఆకుల సతీష్ తమ ఏరియాలో మీ-సేవ లేనందున ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ ప్రాంతానికి ఒక మీ-సేవ కేంద్రాన్ని మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. తాండూర్ మండలానికి విద్యావాలంటీర్లు తమకు అందించవలసిన వేతనాలను త్వరగా అందించి ఆదుకోవాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. దండేపల్లి మండలం మేదరిపేట గ్రామానికి చెందిన బైరి పోచమల్లు కూలీపని చేసుకుంటూ జీవించే నిరుపేద దళిత కుటుంబానికి చెందిన తనకు ప్రభుత్వం అందిస్తున్న దళిత బంధు అవకాశం కల్పించాలని కోరుతూ అర్జీ సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో అందిన ప్రతి దరఖాస్తుపై క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారుల సమన్వయంతో పరిష్కారం దిశగా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.