ఎస్ డి ఎల్ యంత్రాలు ప్రైవేట్ వారికి అప్పగిస్తే వూరుకునేది లేదు సింగరేణి యాజమాన్యానికి మనీ

Published: Wednesday August 24, 2022
 బెల్లంపల్లి   ఆగస్టు 23 ప్రజా పాలన ప్రతినిధి: మందమరి ఏరియాలోని శాంతి ఖనీ బొగ్గుగనిలో నడుస్తున్న ఎస్ డి ఎల్ యంత్రాలను( జి ఎం ఎస్) కంపెనీ  ప్రైవేటు వారికి అప్పగించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అప్పగిస్తే ఊరుకునేది లేదని టిఎన్టియుసి అనుబంధం కార్మిక సంఘం సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి, మణి రామ్ సింగ్ సింగరేణి యాజమాన్యాన్ని  హెచ్చరించారు.
మంగళవారం నాడు స్థానిక యూనియన్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ
కేంద్ర ప్రభుత్వం దేశంలో మొత్తం 88 బొగ్గు బ్లాకులను వేలం ద్వారా ప్రవేటు వారికి అమ్మి వేయటానికి నిర్ణయించిందని, అందులో భాగంగా ఇప్పటికే కోల్ ఇండియా షేర్లను కొంతవరకు అమ్మి వేశారని, లాభాలలో ఉన్న బొగ్గు సంస్థలను సైతం ప్రభుత్వ రంగంలో నడిపించకుండ,   ప్రవేటు యజమాన్యాల ప్రయోజనాలను రక్షించే విధానాలను కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నదని అన్నారు. సింగరేణిలో నాలుగు బ్లాక్ లను ప్రైవేటు పరం చేయటానికి ప్రయత్నించడం కూడా ఈ విధానాలలో భాగమేనని, కేంద్ర ప్రభుత్వ ఇలాంటి కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను కార్మికులంతా వ్యతిరేకించాలని అన్నారు.
 దేశంలో మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి రెండు దశాబ్దాలుగా మంచి లాభాలలో నడుస్తున్నది, ఇలాంటి  సంస్థ  కు చెందిన బొగ్గు బ్లాక్లను వేలం ద్వారా ప్రవేటు యజమాన్యాలకు అప్పచెప్పడం కార్మిక వ్యతిరేక చర్యలు తప్ప మరి ఏమీ కాదని అన్నారు.
 మరొకవైపు సింగరేణి సంస్థలో పనిచేస్తున్న కార్మికులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని, న్యాయమైన సమస్యల  పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ  తీసుకుంటున్న చర్యలు శూన్య మని అన్నారు.
 
కార్మికుల సమస్యల పరిష్కారానికి రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం, దాని అనుబంధ సంస్థ టీబీజీకే కూడా కార్మికుల సమస్యల పరిష్కారానికి  పోరాడింది ఏమీ లేదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను సింగరేణి కార్మిక వర్గం గమనించి అప్రమత్తంతో ఉండాలని, కార్మికులు సంఘటితంగా పోరాడి సమస్యలను పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ప్రైవేట్ కార్మికులను పనిలో చేర్పించడమే  కాకుండా యంత్రాలను సహితం ప్రైవేటు వారికి అప్పగించే ఏర్పాట్లను సంస్థ మానుకోవాలని, లేకపోతే యాజమాన్యానికి వ్యతిరేకంగా,  సమస్యల సాధన కోసం కార్మికులను ఏకం చేసి పోరాటాలు చేయక తప్పదని ఆయన హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు గద్దలనారాయణ, సిరికొండ కనకయ్య, బొల్లు మల్లయ్య, శంకర్, తదితరులు పాల్గొన్నారు.