పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి

Published: Wednesday April 20, 2022
వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల
వికారాబాద్ బ్యూరో 19 ఏప్రిల్ ప్రజాపాలన : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయల కల్పన కొసం ఉద్దేశించి మన ఊరు - మన బడి కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్ నిఖిల పూడూర్ మండలంలోని ప్రభత్వ ఉన్నత మరియు ప్రాథమిక పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ పూడూర్ మండల కేంద్రంలోని పాత ఉన్నత పాఠశాల భవనాన్ని పూర్తిగా కూల్చివేసి అదే స్థానంలో కొత్త పాఠశాల భవన నిర్మాణపు పనులు వెంటనే చేపట్టాలన్నారు. అలాగే ప్రాథమిక పాఠశాల భవనమునకు అవసరమైన మరమ్మత్తు పనులు చేపట్టి అందంగా తీర్చిదిద్దాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.  ప్రాథమిక పాఠశాలకు అవసరమైన  ఫ్లోరింగ్, తలుపులు, కిటికీలు, ఫర్నిచర్ తో పాటు ఇటుకతో ఆకర్షణీయమైన కాంపౌండ్ వాల్ నిర్మించాలన్నారు. గోడలకు ఆకర్షణీయమైన రంగులు వేసే పనులు త్వరగా  ప్రారంభించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పాఠశాలలో మరుగుదొడ్లు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు - మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో సుందరికరణ, పచ్చదనంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించే విధంగా పనులను చేపట్టాలన్నారు. ఈ సందర్బంగా పాఠశాల విద్యార్థులను పలకరించి వారి చదువు తీరును పరిశీలించారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల భాషలో విద్యను అభ్యశించనున్నందున ఉపాధ్యాయులు విద్యార్థులను ఆంగ్ల భాషలో తీర్చి దిద్దాలన్నారు. పూడూర్ నర్సరీలో లక్ష్యం మేరకు మొక్కలు సరిగా లేకపోవడంపై గ్రామ కార్యదర్శిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇప్పటికైనా కొత్త మొక్కలను తెచ్చి పెంచాలని సూచించారు. సర్పంచ్, గ్రామ కార్యదర్శిలు పూర్తి బాధ్యతలు వహించి గ్రామానికి అవసరమైన 12 వేల మొక్కలను సిద్ధం చేయాలన్నారు. మళ్ళీ గ్రామానికి వచ్చే నాటికి లక్ష్యం ప్రకారం మొక్కలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ అధికారిని రేణుక దేవి, డి ఆర్ డి ఓ కృష్ణన్, TSEWIDC డిప్యూటీ ఇంజనీర్ రాజు, పూడూర్ తహసీల్దార్ కిరణ్, ఎంపీడీఓ ఉమాదేవి, డివిజన్ పంచాయతీ అధికారి అనిత, మండల విద్యాధికారి హరిశచంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.