విత్తనాలను దమ్ములో జల్లే విధానంపై అవగాహన

Published: Friday September 16, 2022
బోనకల్, సెప్టెంబర్ 15 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలో కలకోట గ్రామంలో వరి విత్తనాలను నేరుగా దమ్ములో వెదజల్లిన క్షేత్రాలను వ్యవసాయ అధికారి అబ్బూరి శరత్ బాబు గురువారం పరిశీలించి, పలు సూచనలు తెలియజేసారు. విత్తనం వెదజల్లిన 3 నుంచి 5 రోజుల లోపు ఏకవార్షిక గడ్డి జాతి కలుపు మొక్కల నివారణకు ప్రిటిలాక్లోర్ 30.7% ద్రావకం 600 మి.లీ లేదా 
 పైరజోసల్ఫ్యరాన్ ఈథైల్ 10% (సాథి) పొడి 80 గ్రాములు ఎకరాకు కలిపి పొలం అంతటా సమానంగా వెదజల్లాలని,
వెడల్పాకు , తుంగ వంటి గడ్డి జాతి కలుపు మొక్కల నివారణకు,2 నుంచి 4 ఆకుల దశలో(10 నుంచి 15 రోజుల దశ) బిస్పైరిబాక్ సోడియం(నామినీ గోల్డ్) 10% ద్రావకం 80-100 మి.లీ/ ఎకరాకు లేదా ఫెనాక్సులాం 1.02%+ సైహలోఫాప్ బ్యుటైల్ 5.1% ద్రావకం(వివాయ) 800 మి.లీ ఎకరాకు కలుపుపై పడేలా పిచికారీ చేయాలనీ తెలియపరిచారు.ఈ వెదజల్లే పద్దతి లో సాగు చేయడం వలన కూలీ ఖర్చు, నారు ఖర్చు, సమయాన్ని అధిగమించవచ్చుననీ, ఈ పద్దతిలో కేవలం 8 నుండి 10 కేజీల విత్తనం సరిపోతుంది.ఈ విధానం ద్వారా విత్తన ఖర్చు తగ్గించవచ్చునని, ఇలా సాగు చేయడం ద్వారా రైతులకు నారుమడి కి అయ్యే ఖర్చు తగ్గుతుందనీ, నీటి వినియోగాన్ని 30-35% శాతాన్ని తగ్గించవచ్చు, 10 నుంచి 15 రోజుల ముందుగా కోతకు వస్తుందనీ,సుమారు ఎకరానికి 6000 నుండి 8000 వరుకు ఖర్చు ఆదా అవుతుంది అని క్షేత్ర స్థాయిలో రైతులకు వివరించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి నాగినేని నాగసాయి, సహకార సంఘం సీఈవో వనమా మల్లికార్జున్, సిబ్బంది హరికిరణ్ ,గ్రామ రైతులు చావ లక్ష్మణ్ రావు ,అప్పారావు , రాధాకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.