29న చలో ఖమ్మం, వ్యవసాయ కార్మిక సంఘం మహా సభలకు వేలాదిగా తరలిరండి రెడ్ షర్ట్ కవాత్ కన్వీనర్ గుగు

Published: Wednesday December 28, 2022

బోనకల్, డిసెంబరు 27 ప్రజా పాలన ప్రతినిధి: వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర 3వ మహాసభలకు బోనకల్ మండలం నుండి వేలాదిగా తరలిరావాలని రెడ్ షర్ట్ కవాత్ కన్వీనర్ గుగులోతు నరేష్ పిలుపునిచ్చారు. మండలంలోని గ్రామ గ్రామాన విస్తృత ప్రచారం నిర్వహిస్తూ మహాసభలను విజయవంతం చేయాలని మహాసభలకు వ్యవసాయ కూలీలు ప్రతి ఒక్కరు హాజరు కావాలని అన్నారు. ఈ నెల 29, 30 తేదీల్లో ఖమ్మంలో సభలను నిర్వహించనున్నట్లు పిలుపునిచ్చారు. ఈ మహాసభల్లో వివిధ అంశాలపై చర్చించి భవిష్యత్తులో సమస్యల పరిష్కారం కోసం పోరాటం కొనసాగిస్తామన్నారు. రెండు రెక్కల ఆస్తిగా, చెమట చుక్కలే పెట్టుబడిగా గొడ్డు చాకిరీ చేసి మొత్తం సమాజానికి తిండి అందిస్తున్న శ్రామిక వర్గం వ్యవసాయ కార్మికులేనని, ఈ రాష్ట్రంలో నిరుద్యోగం తీవ్రంగా ఎక్కువై పేదలు మరింత పేదలుగా మారుతున్నారని, వ్యవసాయ కార్మికులకు తిండి,బట్ట, ఇల్లు, సాగుభూమి కనీస వేతనం అందడం లేదని, రైతాంగం వ్యవసాయం చేయలేక దివాలా తీస్తుందని, పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేక ప్రభుత్వ విధానాల వల్ల రైతులు వ్యవసాయం చేయలేని పరిస్థితిలో ఉన్నారని, వ్యవసాయ కార్మికుల కూలి రేట్ల పెంపునకు ఉద్యమాలు నడుపుతున్నామని, రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదలందరికీ అందాలని, పోడు భూము రైతులకు హక్కు పత్రాలు అమలుపరచాలని, కౌలు రైతుల సమస్యలపై ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నామని, రాష్ట్రంలో దళిత బంధు ప్రతి ఒక్కరికి వర్తించేలా అమలు చేయాలని, అదేవిధంగా గిరిజన బందును కూడా వెంటనే అమలు చేయాలని, వ్యవసాయ కార్మికుల జీవన పరిస్థితులు మెరుగుకై రైతులు సమస్యలు పరిష్కారానికై వ్యవసాయ కార్మిక సంఘం కృషి చేస్తుందని వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడానికి ఈ మహాసభలు జరుగుతున్నాయని వారు తెలిపారు. ఈ మహాసభలకు ముఖ్యఅతిథిగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ హాజరుకానున్నట్లు తెలిపారు. బోనకల్ మండలంలో రైతులు, వ్యవసాయ కార్మికులు, వ్యవసాయ కూలీలు అధిక సంఖ్యలో తరలి వచ్చి మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా నాయకులు బంక శ్రీనివాసరావు, మర్రి నాగరాజు, అల్లిక పుల్లారావు, మర్రి సాయికుమార్, కంచం నవీన్ తదితరులు పాల్గొన్నారు.