ఆరోగ్యమే మహాభాగ్యం

Published: Friday March 26, 2021
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ జిల్లా ప్రతినిధి మార్చి 25 ( ప్రజాపాలన ) : రోగం వచ్చిన తర్వాత వైద్య చికిత్స చేసే కంటే రోగం రాకుండా తగు జాగ్రత్తలు పాటిస్తే బాగుంటుందని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ హితవు పలికారు. గురువారం అసెంబ్లీ సమావేశాలలో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ద్వారా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ ద్యన్ క్యూర్ విధానాన్ని అనుసరించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కంటి వెలుగు డయాలసిస్ వంటి వైద్యం ప్రజలకు అందించడం అభినందనీయమన్నారు. ఆరోగ్య సమస్యలతో పేదవారు వైద్య చికిత్సను చేసుకోడానికి గగనం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. క్యాన్సర్ వంటి జబ్బును తొందరగా గుర్తిస్తే వైద్య చికిత్స చేయడం సులభతరం అవుతుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ కాలంలో టైఫాయిడ్ మలేరియా డయేరియా వంటి తీవ్ర జబ్బులు కరాళ నృత్యం చేసేవని గుర్తు చేశారు. నీటితో టైఫాయిడ్ దోమలతో మలేరియా డయేరియా వంటి వ్యాధులు వస్తాయని వివరించారు. శుద్ధీకరణ చేసిన మిషన్ భగీరథ నీటితో టైఫాయిడ్, పారిశుద్ధ్యం ( పల్లె ప్రగతి పట్టణ ప్రగతి) పనులతో మలేరియా డయేరియా వంటి జబ్బులను దూరం చేసిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని కొనియాడారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డయాగ్నోస్టిక్ సెంటర్ను ఏర్పాటు చేయడం అభినందించాల్సిన విషయమని అన్నారు. ప్రైమరీ హెల్త్ సెంటర్ లో శాంపిల్స్ తీసి జిల్లా ఆస్పత్రులకు పంపిస్తున్నారు. జిల్లా ఆస్పత్రిలో స్టాప్ కొరత ఉన్నందువలన త్వరగా పరీక్షలు నిర్వహించ లేకపోతున్నారని చెప్పారు. కొత్తగా స్టాప్ ను రిక్రూట్ చేస్తే సమస్య పరిష్కారం అవుతుందని సూచించారు. మహిళలను తరచుగా పట్టిపీడించే బ్రెస్ట్, గర్భసంచి క్యాన్సర్ ను మామోగ్రామ్ ద్వారా తేలికగా గుర్తించి చికిత్స అందించడానికి సులభమవుతుందని తెలిపారు. వికారాబాద్లో 2 కమ్యూనిటీ ఆస్పత్రులు 6 ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఉన్నాయని గుర్తు చేశారు. అనంతగిరిలో ఆయుష్ వైద్య కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి రెండు కోట్లు మంజూరయ్యాయని వివరించారు. వికారాబాద్ జిల్లాకు మెడికల్ కళాశాలను మంజూరు చేయాలని కోరారు.