సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం: జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు

Published: Friday August 26, 2022
ర్యాలీలో జడ్పీ చైర్మన్ కు ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు
 
 
బోనకల్, ఆగస్టు 25 ప్రజా పాలన ప్రతినిధి: రైతన్నల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ సర్కారు పెద్దపీట వేసిందని జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు పేర్కొన్నారు. మండల పరిధిలోని ముష్టికుంట్ల గ్రామంలో రైతుల వ్యవసాయ పనులు కోసం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ లేక ఇబ్బందులు పడుతున్నారనీ, ఇదే విషయాన్ని జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు దృష్టికి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు తీసుకువెళ్ళగా వెంటనే స్పందించిన ఆయన విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి నూతన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను ఏర్పాటు చేయించారు. అందుకు దాదాపుగా 71 విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి సుమారుగా 350 ఎకరాల సాగుకు ఉపయోగపడేలా చర్యలు తీసుకున్నారు. కాగా గురువారం నాడు స్థానిక ప్రజాప్రతినిధులతో కలసి ఆ ట్రాన్స్ఫార్మర్ ను జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు ఏ రాష్ట్రంలో లేవని కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని నేడు ఆ పథకాలు యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచాయని తెలిపారు. వ్యవసాయ పనులు కోసం 24 గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. కేంద్రం ఇబ్బందులు పెడుతున్న రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాలని సీఎం కేసీఆర్ నేరుగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పంట కొనుగోలు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ముందుగా గ్రామానికి చేరుకున్న జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు కు రైతులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున స్వాగతం పలికి ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో లింగాల కమల్ రాజు స్వయంగా ట్రాక్టర్ నడిపి రైతుల్లో ఉత్సహాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బి జాన్బి, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తార్ నాగేశ్వరరావు, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు చేబ్రోలు మల్లికార్జునరావు, కార్యదర్శి మోదుగుల నాగేశ్వరరావు, మాజీ మండల అధ్యక్షులు బంధం శ్రీనివాసరావు, మాజీ జెడ్పిటిసి బానోత్ కొండ, పలువురు ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.