మధిర ప్రజలకు ప్రాణసంకటం-కరోనా విజృంభణలో కీలక వైద్యాధికారులకు ఆకస్మిక డిప్యుటేషన్

Published: Thursday April 29, 2021
మధిర, ఏప్రిల్ 28, ప్రజాపాలన ప్రతినిధి : మధిర ప్రజల ప్రాణాలకు విలువలేదా-వైద్యుల డిప్యుటేషన్ తో పడకేయనున్న ప్రభుత్వ వైద్యం సీఎల్పీ లీడర్, జిల్లా పరిషత్ చైర్మన్ ప్రాతినిధ్యం వహించే మధిరలో అడ్డగోలుగా ముఖ్య వైద్యుల డిప్యూటేషన్డిప్యుటేషన్ రద్దు చేయాలని ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల డిమాండ్ మధిర ప్రభుత్వ ఆసుపత్రిలో అహర్నిశలు పనిచేస్తూ ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్న ఇద్దరు డాక్టర్లను ఆకస్మికంగా ఇతర ప్రాంతాలకు డిప్యుటేషన్ పై బదిలీ చేయటాన్ని ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు వ్యతిరేకిస్తున్నారు. మధిర సివిల్ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ కె అనిల్ కుమార్, డాక్టర్ శ్రావణ్ కుమార్ లు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. మధిర చుట్టు పక్కల గ్రామీణ ప్రాంతాలు కావటంతో పేద ప్రజలకు ప్రభుత్వ వైద్యమే ధిక్కయింది. డాక్టర్ శ్రావణ్, డాక్టర్ అనిల్ కుమార్ రోగులకు మెరుగైన వైద్యం అందించడంతో ఓపీ సేవలు, గర్భిణీ స్త్రీలకు ప్రసూతి సేవలు మెరుగయ్యాయి. డాక్టర్ అనిల్ కుమార్ ఎండీ మెడిసిన్ విభాగంలో, డాక్టర్ శ్రావణ్ కుమార్ అనస్థీషియాగా విస్తృతంగా వైద్య సేవలు అందిస్తున్నారు. గత ఏడాది నుండి కరోనా కష్ట కాలంలో కూడా రోగులకు ఓపికతో వైద్య సేవలు అందించారు. ప్రస్తుతం కోవిడ్ వాక్సినేషన్ ప్రక్రియను ఎలాంటి ఆటంకాలు లేకుండా సమర్ధవంతంగా నడిపిస్తున్నారు. వీరి వైద్య సేవలతో మధిరతోపాటు పక్కన ఉన్న ఆంధ్రా ప్రాతం నుంచి కూడా రోగులు వైద్య సహాయం పొందుతున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో కరోనా కేసులు రోజు రోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ సమయంలో వీరి సేవలు ప్రజలకు ఎంతో అవసరం ఉంది. ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఇద్దరు వైద్యాధికారులను ఒకేసారి డిప్యుటేషన్ పై బదిలీ చేయటంతో మధిర ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు చికిత్సలు నిలిచిపోయే ప్రమాదం పొంచివుంది. ఇక్కడి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎల్పీ లీడర్ భట్టివిక్రమార్క, జిల్లా పరిషత్ చైర్మన్ లు ప్రజా ఆరోగ్యం దృష్ట్యా వారి డిప్యుటేషన్ రద్దు చేయాలని ప్రాంతప్రజలు, ప్రజాసంఘాలు, అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేస్తున్నారు.