గిరిజన హామీలు సత్వరమే పూర్తి చేయాలి, గిరిజన బంధు వెంటనే ఇవ్వాలి

Published: Tuesday February 01, 2022
లంబాడి హక్కుల పోరాట సమితి మండల ఉపాధ్యక్షులు రమేష్ నాయక్
బోనకల్, జనవరి 31 ప్రజాపాలన ప్రతినిధి: సోమవారం కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో చేపట్టిన ధర్నా- ర్యాలీ కార్యక్రమానికి బయలుదేరుతున్న ఎల్ హెచ్ పి ఎస్ బోనకల్ మండలం నాయకులను ముందస్తు అరెస్టు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎల్ హెచ్ పి ఎస్ మండల ఉపాధ్యక్షుడు భూక్య రమేష్ నాయక్ మాట్లాడుతూ శాంతియుతంగా నిరసన తెలపడానికి బయలుదేరుతున్న మా కార్యకర్తలను, నాయకులను అడ్డుకోవడం, అక్రమంగా అరెస్టు చేయడం ప్రభుత్వ నిరంకుశ ధోరణికి, అప్రజాస్వామిక చర్యలకు సాక్ష్యమని మండిపడ్డారు. రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ఏరియాలోని జీవో నెంబర్ 3 ను యధావిధిగా కొనసాగించాలని, గిరిజనులు సాగుచేసుకుంటున్న పోడు భూములకు పట్టాలివ్వాలని, ఎస్టీ రిజర్వేషన్ 3 శాతం నుండి 12 శాతానికి పెంచాలని, గిరిజన బంధు వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఎల్ హెచ్ పి ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గుగులోతు వేణుగోపాల్ నాయక్, ప్రధాన కార్యదర్శి నాగ ప్రవీణ్ నాయక్, ప్రవీణ్ కుమార్, జాయింట్ సెక్రెటరీ ఉదయ్ నాయక్ తదితర నాయకులు పాల్గొన్నారు.